కొండపల్లి బొమ్మలకు విశ్వవ్యాప్త గుర్తింపు తీసుకువస్తాం: మంత్రి కందుల దుర్గేష్


విజయవాడ/కొండపల్లి, BCN NEWS, ఏప్రిల్ 20: తెలుగు సంస్కృతికి ప్రతీకగా నిలిచిన కొండపల్లి బొమ్మల కళను ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు పొందేలా తీసుకువస్తామని ఆంధ్రప్రదేశ్ పర్యాటక, సాంస్కృతిక శాఖ మంత్రి కందుల దుర్గేష్ ప్రకటించారు. ఎన్టీఆర్ జిల్లా కొండపల్లిలో ఏప్రిల్ 18 నుండి 20 వరకు వైభవంగా నిర్వహించిన “కొండపల్లి బొమ్మల పండుగ-2026” ముగింపు వేడుకల్లో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొన్నారు.


ఈ సందర్భంగా మంత్రి దుర్గేష్ మాట్లాడుతూ, ప్రకృతి సిద్ధమైన రంగులు, అపూర్వమైన సృజనాత్మకతతో తయారయ్యే కొండపల్లి బొమ్మలు రాష్ట్రానికి ఒక ప్రత్యేక గుర్తింపు తీసుకొస్తున్నాయని అన్నారు. గత కొంతకాలంగా నిర్లక్ష్యానికి గురైన పర్యాటక రంగానికి కూటమి ప్రభుత్వం పూర్వవైభవం తీసుకువస్తోందని, ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ నాయకత్వంలో కళలు, కళాకారులకు మరింత ప్రోత్సాహం అందిస్తున్నామని తెలిపారు.

ప్రతి సంవత్సరం ఏప్రిల్ 18 నుండి 20 వరకు కొండపల్లి బొమ్మల పండుగను అధికారికంగా నిర్వహిస్తామని మంత్రి వెల్లడించారు. కొండపల్లిని అంతర్జాతీయ స్థాయి “ఎక్స్‌పీరియన్స్ సెంటర్”గా అభివృద్ధి చేసి, పర్యాటకులు స్వయంగా బొమ్మల తయారీ ప్రక్రియను చూసేలా ఏర్పాట్లు చేస్తామని చెప్పారు. అదేవిధంగా సమీప పర్యాటక ప్రాంతాలను కలుపుతూ ప్రత్యేక టూరిజం సర్క్యూట్‌ను అభివృద్ధి చేయనున్నట్లు తెలిపారు.

జీఐ ట్యాగ్ పొందిన కొండపల్లి బొమ్మల కళాకారులకు ప్రభుత్వం పూర్తి సహకారం అందిస్తుందని మంత్రి హామీ ఇచ్చారు. హస్తకళల పరిరక్షణతో పాటు కళాకారుల జీవనోపాధి మెరుగుపరచడంపై ప్రభుత్వం దృష్టి సారించిందన్నారు. భవిష్యత్ తరాలకు ఈ వారసత్వ కళను అందించడం మనందరి బాధ్యత అని ఆయన పేర్కొన్నారు.

ముగింపు వేడుకల్లో భాగంగా నిర్వహించిన బొమ్మల దర్బార్, తోలుబొమ్మలాట, కార్నివాల్, సాంస్కృతిక కార్యక్రమాలు సందర్శకులను ఆకట్టుకున్నాయి. చిన్నారుల ప్రదర్శనలు ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి. ఉత్సవాలను విజయవంతం చేసిన జిల్లా కలెక్టర్ డా. జి. లక్ష్మీశ, అధికారులు, నిర్వాహకులను మంత్రి అభినందించారు.

అంతకుముందు మైలవరం ఎమ్మెల్యే వసంత వెంకట కృష్ణప్రసాద్ ఆహ్వానం మేరకు స్థానిక టీడీపీ కార్యాలయానికి వెళ్లిన మంత్రి దుర్గేష్‌కు కూటమి నాయకులు ఘన స్వాగతం పలికారు. అదే వేదికపై ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు జన్మదిన వేడుకలు నిర్వహించి కేక్ కట్ చేసి శుభాకాంక్షలు తెలిపారు.

ఈ కార్యక్రమంలో నాటక రంగ అకాడమీ చైర్మన్ గుమ్మడి గోపాలకృష్ణ, జిల్లా కలెక్టర్ జి. లక్ష్మీశ, సమాచార పౌర సంబంధాల శాఖ డైరెక్టర్ కేఎస్ విశ్వనాథన్, కొండపల్లి మున్సిపల్ చైర్మన్ చెన్నుబోయిన చిట్టిబాబు, వివిధ శాఖల అధికారులు, ప్రజాప్రతినిధులు, కళాకారులు పాల్గొన్నారు.
WhatsApp "𝘽𝘾𝙉 𝙏𝙑" Group Join Now
Telegram "𝘽𝘾𝙉 𝙏𝙑" Group Join Now