దమ్మపేట మండలం మంధలపల్లి, BCN NEWS: ఎక్స్ రోడ్ వద్ద భారత రాజ్యాంగ పితామహుడు డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారి 135వ జయంతి వేడుకలు ఘనంగా నిర్వహించబడ్డాయి. అంబేద్కర్ యువజన కమిటీ ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ కార్యక్రమంలో స్థానిక నాయకులు, దళిత మరియు ఆదివాసీ సంఘాల ప్రతినిధులు పాల్గొని అంబేద్కర్ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు.
ఈ కార్యక్రమంలో అశ్వరావుపేట నియోజకవర్గ యువ రాజకీయ నాయకులు వాడే వీరస్వామి ముఖ్యంగా పాల్గొని అంబేద్కర్ గారి సేవలను స్మరించారు. అనంతరం మాట్లాడుతూ అంబేద్కర్ గారు కులరహిత, వర్గరహిత సమాజ నిర్మాణం కోసం జీవితాంతం కృషి చేశారని పేర్కొన్నారు. ఆయన ఆశయాలను ఆచరణలో పెట్టడం ద్వారా సమానత్వ సమాజాన్ని సాధించవచ్చని తెలిపారు.
అంబేద్కర్ గారు కేవలం ఒక వర్గానికే కాదు, సమాజంలోని అన్ని వర్గాల ఆశాజ్యోతిగా నిలిచారని వాడే వీరస్వామి అన్నారు. రాజ్యాంగ విలువలను కాపాడుతూ, సమాజంలో సమానత్వాన్ని నెలకొల్పేందుకు ప్రతి ఒక్కరూ అంకితభావంతో పని చేయాలని పిలుపునిచ్చారు. యువత అంబేద్కర్ ఆలోచనలను అనుసరించి సమాజ అభివృద్ధికి కృషి చేయాలని సూచించారు.
ఈ కార్యక్రమంలో దళిత, ఆదివాసీ సంఘాల నాయకులు మత్తే వెంకటేశ్వరరావు, తనగల తిరుపతిరావు, అడమిల్లి పాండు, చెతుకూరి ప్రసాద్, కోర్సా వెంకటేష్ ధోర, తెల్లం రామారావు తదితరులు పాల్గొన్నారు. కార్యక్రమం ఉత్సాహభరితంగా కొనసాగింది.
