అంబులెన్స్ ఆలస్యం… పసిప్రాణం బలి


అల్లూరి సీతారామరాజు జిల్లా హుకుంపేట, BCN NEWS: మండలం గడికించుమండ గ్రామంలో అంబులెన్స్ ఆలస్యంతో ఒక పసిప్రాణం కోల్పోయిన విషాద ఘటన చోటుచేసుకుంది. బంగురు రమేష్ – సుమలత దంపతుల చిన్నారి శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది పడుతుండటంతో కుటుంబ సభ్యులు వెంటనే పాడేరు ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. అక్కడ వైద్యులు ఆక్సిజన్ అందించినప్పటికీ, అవసరమైన శిశు చికిత్స పరికరాలు అందుబాటులో లేకపోవడంతో విశాఖపట్నం కేజీహెచ్‌కు తరలించాలని సూచించారు.


కుటుంబ సభ్యుల వాదన ప్రకారం ఉదయం సుమారు 8:30 గంటలకు ఆసుపత్రికి చేరుకున్నప్పటికీ, అంబులెన్స్ కోసం పలుమార్లు ఫోన్ చేసినా స్పందన రాలేదని ఆరోపిస్తున్నారు. సమయానికి అంబులెన్స్ అందుబాటులో లేకపోవడంతో చిన్నారి ప్రాణం కోల్పోయిందని వారు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఆసుపత్రిలో సరైన వైద్యం లేకపోవడం, అత్యవసర సేవల్లో నిర్లక్ష్యం కారణంగా ఈ దుర్ఘటన జరిగిందని ఆరోపించారు.

ఈ ఘటనతో కుటుంబ సభ్యులు కన్నీరుమున్నీరవుతూ అధికారులను ప్రశ్నిస్తున్నారు. గిరిజన ప్రాంతాల్లో వైద్య సదుపాయాలు మెరుగుపరిచామని చెప్పే ప్రభుత్వ వాదనలు వాస్తవ పరిస్థితులకు విరుద్ధమని వారు ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇకపై ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా తక్షణ చర్యలు తీసుకోవాలని, బాధ్యులపై కఠిన చర్యలు చేపట్టాలని డిమాండ్ చేశారు.

గ్రామస్థులు, కుటుంబ సభ్యులు ఈ ఘటనపై తీవ్ర ఆవేదన వ్యక్తం చేస్తూ, పసిప్రాణాలు కోల్పోకుండా ఆరోగ్య సేవలను బలోపేతం చేయాలని ప్రభుత్వాన్ని కోరుతున్నారు.
WhatsApp "𝘽𝘾𝙉 𝙏𝙑" Group Join Now
Telegram "𝘽𝘾𝙉 𝙏𝙑" Group Join Now