ఆంధ్రప్రదేశ్, ఏలూరు, టి. నరసాపురం మండలం, గండిగూడెం: మధ్యాహ్న భోజన పథకం అమలులో నిర్లక్ష్యం వెలుగుచూసింది. టి. నరసాపురం మండలం గండిగూడెం గ్రామంలోని అంగన్వాడి కేంద్రం, ప్రాథమిక పాఠశాలను విజిలెన్స్ కమిటీ సభ్యుడు డాక్టర్ వంటిపల్లి విజయకృష్ణ ఆకస్మికంగా తనిఖీ చేశారు. పాఠశాలలో విద్యార్థులకు అందుతున్న మధ్యాహ్న భోజన పథకం నిర్వహణకు సంబంధించిన రికార్డులను ఆయన పరిశీలించారు. అయితే బియ్యం, గుడ్లు, చిక్కీలు తదితర సరుకుల నిల్వ, వినియోగానికి సంబంధించిన వివరాలు కొన్ని రోజులుగా నమోదు చేయకపోవడంపై ఆయన తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు.
ప్రాథమిక పాఠశాలలో రికార్డుల నిర్వహణపై ప్రశ్నించగా, అవన్నీ ప్రధానోపాధ్యాయుడే చూసుకుంటారని, ఆయన ఈ రోజు సెలవులో ఉన్నారని సిబ్బంది సమాధానం ఇచ్చారు. దీంతో విజిలెన్స్ కమిటీ సభ్యుడు, స్థానిక గ్రామస్థులు ఆశ్చర్యం వ్యక్తం చేశారు. పథకానికి సంబంధించిన కీలకమైన రికార్డులు నిరంతరం అందుబాటులో ఉండాల్సిన సమయంలో వాటిని సక్రమంగా నిర్వహించకపోవడంపై విజయకృష్ణ ఆగ్రహం వ్యక్తం చేశారు. విద్యార్థులకు అందుతున్న ఆహార పదార్థాల వివరాలు, నిల్వలు, వినియోగంపై పారదర్శకత ఉండాలని ఆయన సూచించారు.
అనంతరం అంగన్వాడి కేంద్రాన్ని తనిఖీ చేయగా అక్కడ హెల్పర్‌తో పాటు కొంతమంది పిల్లలు మాత్రమే కనిపించారు. నెలల తరబడి రికార్డులు సక్రమంగా రాయలేదని, బాలింతలు, ఇతర లబ్ధిదారుల వివరాలు కూడా నమోదు కాలేదని గుర్తించారు. కనీసం పిల్లల హాజరు వివరాలను కూడా నమోదు చేయకపోవడంపై విజయకృష్ణ తీవ్ర అసహనం వ్యక్తం చేశారు. రికార్డులు రాయవద్దని చెప్పారని, అంగన్వాడి వర్కర్ అప్పుడప్పుడు వచ్చి ఫోన్‌లో వివరాలు నమోదు చేసుకుంటారని హెల్పర్ చెప్పడం తనిఖీ సమయంలో మరింత చర్చనీయాంశంగా మారింది.
స్థానికుల నుంచి వచ్చిన ఫిర్యాదుల మేరకే తాను ఈ ఆకస్మిక తనిఖీ నిర్వహించినట్లు విజిలెన్స్ కమిటీ సభ్యుడు డాక్టర్ వంటిపల్లి విజయకృష్ణ తెలిపారు. పథకం అమలులో నిర్లక్ష్యం, రికార్డుల నిర్వహణలో లోపాలు ఉంటే వాటిని ఉపేక్షించబోమని స్పష్టం చేశారు. బాధ్యులపై శాఖాపరమైన చర్యలు తీసుకునేలా ఉన్నతాధికారుల దృష్టికి విషయాన్ని తీసుకెళ్తామని ఆయన తెలిపారు. పిల్లలు, బాలింతలు, ఇతర లబ్ధిదారులకు అందాల్సిన ప్రభుత్వ పథకాలు సక్రమంగా అమలయ్యేలా అధికారులు కఠినంగా పర్యవేక్షించాలని ఆయన కోరారు.

