ఏలూరు, ఆగస్టు 9: ఏలూరులోని శుభలేఖ కన్వెన్షన్‌లో ఆదివారం “కెమిస్ట్స్ అవేర్‌నెస్ మీట్-2026” కార్యక్రమం నిర్వహించారు. ఏలూరు కెమిస్ట్స్ అండ్ డ్రగ్గిస్ట్స్ అసోసియేషన్, రూరల్ ఏరియా అసోసియేషన్ల సంయుక్త ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం జరిగింది. ఔషధ నిబంధనలు, సరైన ప్రిస్క్రిప్షన్ విధానాలు, మందుల దుర్వినియోగాన్ని అరికట్టాల్సిన అవసరంపై కెమిస్టులకు అవగాహన కల్పించారు. ముఖ్యంగా ‘P5’ సూత్రం అంటే యజమాని, ఫార్మసిస్ట్, వైద్యుడు, రోగి, ప్రిస్క్రిప్షన్ మధ్య ఉండాల్సిన బాధ్యతలు, సమన్వయం గురించి వివరించారు.
ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ఏపీ ఈగల్ చీఫ్ ఐజీపీ శ్రీ ఆకే రవికృష్ణ ఐపీఎస్ హాజరై కీలక అంశాలను వెల్లడించారు. డ్రగ్స్ సమస్య కేవలం సామాజిక సమస్య మాత్రమే కాదని, జాతీయ భద్రతకు సంబంధించిన అంశంగా మారుతోందని ఆయన పేర్కొన్నారు. సింథటిక్ డ్రగ్స్ వెనుక అంతర్జాతీయ కుట్రలు, నార్కో-టెర్రరిజం వంటి అంశాలు ఉన్నాయని హెచ్చరించారు. డ్రగ్స్ కొనుగోలుకు ఖర్చు చేసే ప్రతి రూపాయి దేశద్రోహ శక్తులకు చేరే అవకాశం ఉందని, ఈ విషయంలో ప్రతి ఒక్కరూ బాధ్యతగా వ్యవహరించాలని సూచించారు.
NRx, షెడ్యూల్ H1 వంటి ఔషధాల విక్రయాల్లో కెమిస్టులు మరింత అప్రమత్తంగా ఉండాలని ఐజీపీ రవికృష్ణ సూచించారు. ఆయా మందుల దుర్వినియోగాన్ని అరికట్టేందుకు త్వరలో డిజిటల్ ట్రాకింగ్ విధానం అందుబాటులోకి రానున్నట్లు తెలిపారు. డ్రగ్స్‌కు సంబంధించిన సమాచారం అందించేందుకు ఈగల్ ప్రత్యేక ఏర్పాట్లు చేసిందని, 24 గంటలు అందుబాటులో ఉండే హెల్ప్‌లైన్/వాట్సాప్ నంబర్ *1972* ద్వారా సమాచారం ఇవ్వవచ్చని పేర్కొన్నారు. వెబ్‌సైట్‌లో అనామకంగా లాగిన్ అయి వివరాలు అందించే అవకాశం కూడా ఉందని, సమాచారాన్ని గోప్యంగా ఉంచుతామని తెలిపారు.
అదేవిధంగా సైబర్ నేరాలపై కూడా ఐజీపీ ప్రజలను అప్రమత్తం చేశారు. డిజిటల్ అరెస్టులు, అనధికారిక లింకులు, లోన్ యాప్‌ల విషయంలో జాగ్రత్తగా ఉండాలని సూచించారు. సైబర్ మోసానికి గురైన వెంటనే 1930 నంబర్‌కు ఫిర్యాదు చేయాలని తెలిపారు. ఈ కార్యక్రమంలో విజయవాడ డ్రగ్ కంట్రోల్ జాయింట్ డైరెక్టర్ వి. విజయశేఖర్, ఏపీ ఈగల్ ఎస్పీ ఎం. మహేశ్వరరాజు, విజయవాడ ఈగల్ ఇన్‌స్పెక్టర్ రవీంద్ర, ఏలూరు ఈగల్ ఆర్‌ఎస్‌ఐ ఉదయభాస్కర్, డీసీఏ అధికారులు, ఈగల్ సిబ్బంది, ఏలూరు మరియు రూరల్ కెమిస్ట్స్ అసోసియేషన్ అధ్యక్ష, కార్యదర్శులు గుట్టా రవిచంద్ర, సయ్యద్ బాజిద్, ఏ. చంద్ర మోహన్, పి. వాసుదేవరావు తదితరులు పాల్గొన్నారు.



