ఏలూరు, BCN NEWS, ఏప్రిల్ 19: హైదరాబాద్ డ్రగ్స్ కేసుతో తనకు ఎలాంటి సంబంధం లేదని, తాను ఎటువంటి తప్పు చేయలేదని ఏలూరు ఎంపీ పుట్టా మహేష్ కుమార్ స్పష్టం చేశారు. ఆరోపణలు వచ్చిన తరువాత దాదాపు 40 రోజుల తర్వాత ఆదివారం ఏలూరుకు వచ్చిన ఆయనకు అభిమానులు, పార్టీ కార్యకర్తలు ఘన స్వాగతం పలికారు. గన్నవరం ఎయిర్‌పోర్టు నుంచి ప్రారంభమైన ఈ స్వాగత ర్యాలీ ఏలూరు వరకు భారీగా కొనసాగింది.
మధ్యాహ్నం శాంతినగర్‌లోని తన క్యాంపు కార్యాలయానికి చేరుకున్న ఎంపీకి పూలవర్షంతో అభిమానులు స్వాగతం పలికారు. అనంతరం మీడియాతో మాట్లాడిన ఆయన, తనపై వచ్చిన ఆరోపణలన్నీ అసత్యమని స్పష్టం చేశారు. కేసు విచారణలో నిజాలు బయటపడతాయని, తాను “కడిగిన ముత్యంలా” నిర్దోషిగా బయటకు వస్తానని విశ్వాసం వ్యక్తం చేశారు.
ఈ సందర్భంగా మీడియా సంయమనం పాటించాలని ఎంపీ కోరారు. తాను ఏ తప్పు చేయకపోయినా కొన్ని వార్తలు తనకు మనస్థాపం కలిగించాయని పేర్కొన్నారు. కష్ట సమయంలో తనకు అండగా నిలిచిన పార్టీ కార్యకర్తలు, అభిమానులకు కృతజ్ఞతలు తెలిపారు. ఏలూరు పార్లమెంటు అభివృద్ధికి కట్టుబడి పనిచేస్తానని హామీ ఇచ్చారు.
ఎంపీని కలిసిన ప్రజాప్రతినిధులు
ఏలూరుకు చేరుకున్న ఎంపీ పుట్టా మహేష్ కుమార్‌ను టీడీపీ జిల్లా అధ్యక్షుడు, ఏలూరు ఎమ్మెల్యే బడేటి రాధాకృష్ణయ్య, ఎమ్మెల్యేలు చింతమనేని ప్రభాకర్, సొంగా రోషన్ కుమార్, ధర్మరాజు తదితరులు మర్యాదపూర్వకంగా కలిశారు. అలాగే అప్కాబ్ చైర్మన్ గన్ని వీరాంజనేయులు, మాజీ ఎమ్మెల్యే ఘంటా మురళి సహా పలువురు నేతలు ఆయనను పరామర్శించారు.
భారీ ర్యాలీతో ఏలూరుకు రాక
ఉదయం గన్నవరం ఎయిర్‌పోర్టుకు చేరుకున్న ఎంపీకి వేలాదిగా తరలివచ్చిన అభిమానులు ఘన స్వాగతం పలికారు. ఎయిర్‌పోర్టు నుంచి ఏలూరుకు బయలుదేరిన ఆయన వెంట వందలాది వాహనాలు ర్యాలీగా సాగాయి. ప్లకార్డులు, బ్యానర్లతో అభిమానులు నినాదాలు చేస్తూ మద్దతు తెలిపారు.
శాంతినగర్ ప్రాంతం జనసందోహంతో కిక్కిరిసింది
ఏలూరు నగరంతో పాటు పరిసర నియోజకవర్గాల నుంచి వచ్చిన కార్యకర్తలు, అభిమానులతో శాంతినగర్ పరిసర ప్రాంతాలు జనసందోహంతో నిండిపోయాయి. ఎంపీకి ప్రజల మద్దతు స్పష్టంగా కనిపించిందని స్థానిక నేతలు పేర్కొన్నారు.
