భద్రాద్రి కొత్తగూడెం జిల్లా, మణుగూరు, BCN NEWS: డా. బి.ఆర్. అంబేద్కర్ 135వ జయంతి సందర్భంగా మణుగూరులో భారీ స్థాయిలో ఊరేగింపులు, కార్యక్రమాలు నిర్వహించడంతో పట్టణం జై భీమ్ నినాదాలతో మార్మోగింది. అంబేద్కర్ జయంతి వేడుకలు ఈసారి కనీవినీ ఎరుగని రీతిలో ఘనంగా జరిగాయి.
అంబేద్కర్ సెంటర్ వద్ద ప్రారంభమైన వేడుకలు బండారిగూడెం ప్రాంతంలో అద్భుతంగా కొనసాగాయి. హెలికాప్టర్ ద్వారా పుష్పగుచ్చాలు వెదజల్లడం ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. భారీ విగ్రహాలతో నిర్వహించిన ఊరేగింపులు ప్రజలను ఆకట్టుకున్నాయి.
సింగరేణి సంస్థ, మున్సిపాలిటీ, పోలీస్, రెవెన్యూ శాఖల అధికారులు, వివిధ రాజకీయ పార్టీల నేతలు, ఎస్సీ, ఎస్టీ, బీసీ సంఘాల నాయకులు, జర్నలిస్టులు, సామాజిక కార్యకర్తలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. నీలి కండువాలతో వందలాది మంది అంబేద్కర్ అభిమానులు పాల్గొని, “జై భీమ్” నినాదాలతో కార్యక్రమాన్ని ఉత్సాహభరితంగా నిర్వహించారు.
ఈ సందర్భంగా సింగరేణి జనరల్ మేనేజర్ దుర్గం రామచందర్, మణుగూరు డీఎస్పీ వంగ రవీందర్ రెడ్డి, ఎస్‌హెచ్‌ఓ నాగబాబు, జర్నలిస్టుల సంఘం అధ్యక్షుడు పిండిగా వెంకట్ తదితరులు పాల్గొన్నారు. అలాగే దళిత నాయకులు కురి రాజేశ్వరరావు, రావులపల్లి రామ్మూర్తి, ఇతర సంఘాల ప్రతినిధులు, యువత, మహిళలు భారీ సంఖ్యలో హాజరయ్యారు.
మణుగూరు చరిత్రలో ఇదొక గొప్ప ఘట్టంగా నిలిచేలా అంబేద్కర్ జయంతి వేడుకలు హట్టహాసంగా జరిగాయి.

