అప్రమత్తతే అగ్ని ప్రమాదాల నివారణకు కీలకం.. ఘనంగా ముగిసిన అగ్నిమాపక వారోత్సవాలు


VIJAYAWADA, BCN NEWS, APRIL, 20: రాష్ట్ర అగ్నిమాపక శాఖ ఆధ్వర్యంలో ఏప్రిల్ 14 నుంచి 20 వరకు రాష్ట్రవ్యాప్తంగా నిర్వహించిన అగ్నిమాపక వారోత్సవాలు విజయవంతంగా ముగిశాయి. ఈ సందర్భంగా ప్రజల్లో అగ్ని భద్రతపై అవగాహన పెంపొందించేందుకు పలు కార్యక్రమాలు చేపట్టినట్లు అగ్నిమాపక శాఖ అదనపు డైరెక్టర్ జి. శ్రీనివాసరావు (నార్త్) తెలిపారు. విజయవాడ బందరు రోడ్డులోని పీవీపీ షాపింగ్ మాల్‌లో సోమవారం నిర్వహించిన మాక్ డ్రిల్ కార్యక్రమం ఈ వారోత్సవాలకు ముఖ్య ఆకర్షణగా నిలిచింది.


మాక్ డ్రిల్ ద్వారా షాపింగ్ మాల్స్, వాణిజ్య సముదాయాల్లో అగ్ని ప్రమాదాలు సంభవించినప్పుడు తీసుకోవాల్సిన భద్రతా చర్యలను ప్రదర్శించారు. ప్రమాదాల సమయంలో ప్రాణ, ఆస్తి నష్టాన్ని తగ్గించేందుకు ప్రజలు పాటించాల్సిన జాగ్రత్తలపై విస్తృతంగా అవగాహన కల్పించారు. రాష్ట్రవ్యాప్తంగా సుమారు 10 వేలకుపైగా అవగాహన కార్యక్రమాలు నిర్వహించి, మాల్స్, ఆసుపత్రులు, పరిశ్రమల్లో ప్రత్యేక డ్రిల్స్ నిర్వహించినట్లు అధికారులు తెలిపారు.

అగ్నిమాపక శాఖలో ఆధునిక సాంకేతిక పరిజ్ఞానాన్ని ప్రవేశపెడుతూ, 55 మీటర్ల టర్న్ టేబుల్ లాడర్స్ వంటి పరికరాలను వినియోగంలోకి తీసుకువచ్చినట్లు అధికారులు వెల్లడించారు. భవిష్యత్తులో అత్యవసర పరిస్థితుల్లో వేగవంతమైన చర్యల కోసం డ్రోన్లు, రోబోటిక్ టెక్నాలజీ వినియోగంపై కూడా దృష్టి సారిస్తున్నట్లు తెలిపారు. ముఖ్యంగా ఆసుపత్రులు, పరిశ్రమల్లో ఎలక్ట్రికల్ షార్ట్ సర్క్యూట్‌లు, ఆక్సిజన్ సంబంధిత ప్రమాదాలను నివారించేందుకు ప్రత్యేక చర్యలు తీసుకుంటున్నామని చెప్పారు.

అగ్నిమాపక శాఖ అదనపు డైరెక్టర్ ఆర్. జ్ఞానసుందరం (సౌత్) మాట్లాడుతూ, అగ్ని ప్రమాదాల నివారణకు ప్రజల సహకారం ఎంతో అవసరమని తెలిపారు. అత్యవసర పరిస్థితుల్లో ఎలా స్పందించాలి, ప్రాణాలను ఎలా రక్షించుకోవాలి అనే విషయాలపై ప్రజలు అవగాహన కలిగి ఉండాలని సూచించారు. పొగ వల్ల ఆక్సిజన్ తగ్గినప్పుడు తడి గుడ్డను ముక్కుకు అడ్డుగా పెట్టుకోవడం వంటి ప్రాథమిక జాగ్రత్తలు ప్రాణాలను కాపాడగలవని పేర్కొన్నారు.

అగ్నిమాపక సిబ్బంది 24 గంటలూ సిద్ధంగా ఉండి, ప్రమాద సమాచారం అందిన వెంటనే 3 నుంచి 8 నిమిషాల్లో ఘటన స్థలానికి చేరుకుని సహాయక చర్యలు చేపడుతున్నారని తెలిపారు. ఎత్తైన భవనాల్లో ప్రమాదాలు సంభవించినప్పుడు టర్న్ టేబుల్ లాడర్స్, ఫైర్ టవర్ల సహాయంతో బాధితులను సురక్షితంగా బయటకు తీసుకురావడంలో శాఖ సామర్థ్యం పెరిగిందన్నారు.

మల్టీ స్టోరీ భవనాలు, షాపింగ్ మాల్స్, వాణిజ్య సంస్థల సిబ్బందికి క్రమం తప్పకుండా శిక్షణా కార్యక్రమాలు నిర్వహిస్తూ అగ్ని భద్రతపై అవగాహన పెంచుతున్నామని అధికారులు తెలిపారు. ముందస్తు జాగ్రత్తలు, సరైన శిక్షణతో అగ్ని ప్రమాదాలను గణనీయంగా తగ్గించవచ్చని పేర్కొంటూ, ప్రజలు భయపడకుండా అగ్నిమాపక శాఖతో సహకరించాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో జిల్లా ఫైర్ ఆఫీసర్ ఏ.వి. శంకర్ రావు, వీఎంసీ ఫైర్ ఆఫీసర్ మాల్యాద్రి తదితరులు పాల్గొన్నారు.
WhatsApp "𝘽𝘾𝙉 𝙏𝙑" Group Join Now
Telegram "𝘽𝘾𝙉 𝙏𝙑" Group Join Now