ఏలూరు, ఆగస్టు 9: రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఈనెల 10వ తేదీన ఏలూరు జిల్లాలోని కలిదిండిలో పర్యటించనున్నారు. ఈ పర్యటనలో భాగంగా సీఎం చంద్రబాబు పలు కార్యక్రమాల్లో పాల్గొని, రైతులు, ప్రజాప్రతినిధులు, పార్టీ క్యాడర్‌తో సమావేశం కానున్నారు. ఉదయం 10.30 గంటలకు గుంటూరు జిల్లా తాడేపల్లి నుంచి హెలికాప్టర్‌లో బయలుదేరి, 10.45 గంటలకు కలిదిండిలోని ప్రభుత్వ జూనియర్ కళాశాలలో ఏర్పాటు చేసిన హెలిప్యాడ్‌కు చేరుకుంటారు. అక్కడ మంత్రులు, ఎమ్మెల్యేలు, అధికారులు, స్థానిక ప్రజాప్రతినిధులతో సీఎం సమావేశం కానున్నారు.
అనంతరం ఉదయం 11 గంటలకు కలిదిండి తహసీల్దార్ కార్యాలయానికి ముఖ్యమంత్రి చేరుకుంటారు. అక్కడ రైతులతో నేరుగా సమావేశమై వారి సమస్యలు, అవసరాలపై చర్చించనున్నారు. రైతులతో మాట్లాడిన అనంతరం పలు అంశాలపై సీఎం అధికారులతో సమీక్షించే అవకాశం ఉంది. ఈ కార్యక్రమం అనంతరం ఉదయం 11.45 గంటలకు తహసీల్దార్ కార్యాలయం నుంచి బయలుదేరి, కలిదిండిలోని పాత పోస్టాఫీస్ వెనుక ఏర్పాటు చేసిన ప్రజావేదిక కార్యక్రమానికి చేరుకుంటారు.
మధ్యాహ్నం 2.05 గంటల వరకు సీఎం చంద్రబాబు ప్రజావేదిక కార్యక్రమంలో పాల్గొంటారు. ఈ కార్యక్రమంలో ప్రజల నుంచి సమస్యలు, వినతులు స్వీకరించి, సంబంధిత అంశాలపై అధికారులతో చర్చించనున్నారు. అనంతరం మధ్యాహ్నం 2.55 గంటలకు కలిదిండి వ్యవసాయ మార్కెట్ యార్డుకు చేరుకుంటారు. అక్కడ పార్టీ క్యాడర్‌తో ఏర్పాటు చేసిన సమావేశంలో పాల్గొని, పార్టీ శ్రేణులకు దిశానిర్దేశం చేయనున్నారు.
పార్టీ క్యాడర్ సమావేశం అనంతరం సాయంత్రం 4.25 గంటలకు వ్యవసాయ మార్కెట్ యార్డ్ నుంచి సీఎం బయలుదేరుతారు. 4.35 గంటలకు కలిదిండిలోని ప్రభుత్వ జూనియర్ కళాశాలలో ఏర్పాటు చేసిన హెలిప్యాడ్‌కు చేరుకుంటారు. అనంతరం సాయంత్రం 4.40 గంటలకు హెలికాప్టర్‌లో కలిదిండి నుంచి ఉండవల్లికి బయలుదేరి వెళతారు. సీఎం పర్యటన నేపథ్యంలో అధికారులు ఇప్పటికే ఏర్పాట్లు పూర్తి చేస్తున్నారు.
