ఏలూరు, జూన్, 29 : పిజిఆర్ఎస్ లో ప్రజల నుండి అందిన ఫిర్యాదులపై సమగ్ర విచారణ చేసి నాణ్యమైన రీతోలో పరిష్కరించాలని, నిర్లక్ష్యం వహించే అధికారులను సస్పెండ్ చేస్తానని జిల్లా కలెక్టర్ కె. వెట్రిసెల్వి ఎన్యూమరేషన్ సిబ్బందిని ఆదేశించారు. స్థానిక కలెక్టరేట్ నుండి సోమవారం పిజిఆర్ఎస్ అర్జీల పరిష్కారం, ప్రత్యేక ఇంటెన్సివ్ రివిజన్ (SIR),సమీకృత కుటుంబ సర్వే ఫిర్యాదుల పరిష్కారం, తదితర అంశాలపై జిల్లా అధికారులు, తహసీల్దార్లు, ఎంపిడిఓ లు, బి ఎల్ ఓ లతో కలెక్టర్ జూమ్ కాన్ఫరెన్స్ ద్వారా సమీక్షించారు.
ఈ సందర్భంగా కలెక్టర్ వెట్రిసెల్వి మాట్లాడుతూ నిడమర్రు మండలం అడవికొలను గ్రామానికి చెందిన ప్రజలు పిజిఆర్ఎస్ లో తమ గ్రామంలో కలుషిత త్రాగునీటిని సరఫరా చేస్తున్నారని నీటిని తనకు చూపించి ప్రజలు ఫిర్యాదు చేస్తే, సంబంధిత మండలంలోని ఆర్డబ్ల్యూఎస్ అధికారులు ఎటువంటి పరిశీలన చేయకుండా, నీటి పరీక్షలు నిర్వహించకుండా కలుషిత త్రాగునీటిని సరఫరా చేయడంలేదని నివేదిక సమర్పించడం ప్రజా సమస్యల పరిష్కారం పట్ల నిర్లక్ష్యం వహించడమేనని, సంబంధిత అధికారిపై వెంటనే క్రమశిక్షణా చర్యలకు ప్రతిపాదనలు సమర్పిచాలని జిల్లా పంచాయతీ అధికారి మల్లికార్జునరావు ని కలెక్టర్ ఆదేశించారు.
వర్షాకాలం సమయంలో త్రాగునీటి వనరులు కలుషితం కాకుండా ఓవర్ హెడ్ ట్యాంకులు శుభ్రం చేసేందుకు చర్యలు తీసుకోవాలని, నీటి పరీక్షలు చేసి త్రాగునీరు కలుషితం అయినట్లు గుర్తిస్తే వెంటనే రక్షిత త్రాగునీరు సరఫరాకు చర్యలు తీసుకోవాలన్నారు. అదేవిధంగా జిల్లాలోని అన్ని పాఠశాలలు, కళాశాలల్లో త్రాగునీటి పరీక్షలు నిర్వహించి, ట్యాంకులు శుభ్రం చేయించాలన్నారు. పిజిఆర్ఎస్ అర్జీ పరిష్కారంలో ఫిర్యాదుదారుని కలిసి సమస్య తెలుసుకుని పరిష్కారానికి చర్యలు తీసుకోవాలని, అందుకు సంబంధించిన ఫోటోలు పరిష్కార నివేదికతోపాటు పిజిఆర్ఎస్ వెబ్సైటు లో అప్లోడ్ చేయాలన్నారు.
వివిధ శాఖలు ప్రజలకు అందించే సేవలలో ప్రజల సంతృప్తి స్థాయి పెరిగేలా సేవలందించాలన్నారు. ప్రత్యేక ఇంటెన్సివ్ రివిజన్ (SIR) -2026 కార్యక్రమంలో ఎన్యూమరేషన్ ఫారంలు డిజిటైజేషన్ ప్రక్రియ వేగవంతం చేయాలన్నారు. ఏలూరు, దెందులూరు నియోజకవర్గాలలో ఎన్యూమరేషన్ ఫారంలు డిజిటైజేషన్ ప్రక్రియ చురుకుగా సాగడంలేదని, ప్రత్యేక ఇంటెన్సివ్ రివిజన్ (SIR) కార్యక్రమం ఎన్నికల విధులతో సమాన ప్రాధాన్యత కలిగిన కార్యక్రమమన్నారు. ఎన్యూమరేషన్ ఫారంలు డిజిటైజేషన్ లో వెనుకబడిన అధికారులకు షోకాజ్ నోటీసులు జారీ చేస్తామని కలెక్టర్ హెచ్చరించారు.
సమీకృత కుటుంబ సర్వే లో అందిన ఫిర్యాదులపై వెంటనే చర్యలు తీసుకుని పరిష్కరించి నివేదిక సమర్పించాలని కలెక్టర్ అధికారులను ఆదేశించారు. పోలింగ్ బూత్ స్థాయి అధికారులు, పోలింగ్ బూత్ స్థాయి ఏజెంట్ లతో సమావేశాలు నిర్వహించి సమావేశపు మినిట్స్ ఫోటోలతో సహా నివేదిక సమర్పించాలని కలెక్టర్ ఆదేశించారు.
ఇంచార్జ్ డిఆర్ఓ దేవకీదేవి, నూజివీడు సబ్ కలెక్టర్ బి. వినూత్న, జిల్లా పరిషత్ సీఈఓ జగదాంబ, డిపిఓ మల్లికార్జునరావు, ఆర్డీఓ లు లక్ష్మీప్రసన్న, రమణ, స్వర్ణ గ్రామ/వార్డ్ సచివాలయాలు ప్రత్యేక అధికారి నాయుడు, ఈఆర్ఓ లు, ఏఈఆర్ఓ లు, తహసీల్దార్లు, ఎంపిడిఓలు, బిఎల్ఓ లు, ప్రభృతులు పాల్గొన్నారు.
