ఫిర్యాదులు పరిష్కారంలో అధికార్లు ప్రత్కేక శ్రద్ధ తీసుకోవాలి.: జిల్లా కలెక్టర్ కె. వెట్రిసెల్వి


ఏలూరు, జూన్ 29 :  ప్రజల సంతృప్తి స్థాయి పెరిగేలా అర్జీలకు  నాణ్యమైన పరిష్కారం చూపాలని జిల్లా కలెక్టర్ కె. వెట్రిసెల్వి అధికారులను ఆదేశించారు. జిల్లా కలెక్టరేటులోని గోదావరి సమావేశ మందిరంలో  సోమవారం  ప్రజాసమస్యలు పరిష్కార వేదిక కార్యక్రమాన్ని జిల్లా స్థాయీ అధికారులతో జిల్లా కలెక్టరు కె.వెట్రిసెల్వి నిర్వహించారు. జిల్లా కలెక్టరుతో పాటు ట్రైనీ  కలెక్టరు శ్రావణకుమార్ రెడ్డి, ఇంచార్జి డిఆర్వో ఎల్.దేవకీదేవి, స్పెషల్ డిప్యూటీ కలెక్టరు కె.భాస్కర్, ఆర్డీవో కె.లక్ష్మీప్రసన్న, ఎస్సీ కార్పొరేషన్ ఇడి యం.ముక్కంటి లు  ప్రజలు నుండి అర్జీలను స్వీకరించారు.   


ఈ సందర్భంగా జిల్లా కలెక్టరు కె.వెట్రిసెల్వి మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం ప్రజా సమస్యలు పరిష్కారానికి అత్యంత ప్రాధాన్యత ఇస్తున్న నేపథ్యంలో అధికారులు స్వీకరించిన ప్రతి అర్జీపై బాధ్యతాయుతంగా వ్యవహరించి, అర్జీలు రీఓపెన్ కాకుండా  నిర్ణీత గడువు లోపుగా పరిష్కారం చూపాలని ఆదేశించారు. ప్రజా సమస్యలు పరిష్కార వేదికలో అందిన ప్రతి అర్జీని పరిశీలించి శాశ్వత పరిష్కారం చూపాలన్నారు.   క్షేత్రస్థాయిలో వెళ్ళి లబ్ధిదారులుతో నేరుగా మాట్లాడి  వారి సమస్యలను  అర్థం చేసుకుని పరిష్కరించాలని సూచించారు. ప్రతి సోమవారం పి.జి.ఆర్.ఎస్ మరియు రెవెన్యూ క్లినిక్‌లో అందిన అర్జీలుపై శాఖలు వారీగా అధికారులు సమీక్షలు నిర్వహించి, సమస్యలు పరిష్కారానికి తక్షణ చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు. సోమవారం నిర్వహించిన పిజిఆర్ఎస్ కార్యక్రమంలో  274 అర్జీలు వచ్చాయని కలెక్టర్ వెట్రిసెల్వి తెలియజేసారు. 

ఈ రోజు వచ్చిన అర్జీలలో కొన్ని...
ఏలూరు రూరల్ మండలం పోణంగి కి చెందిన కాకర్ల దానమ్మ తన దరఖాస్తులో శాస్త్రి, బాబు అనే వాళ్ళు తనను ఇంటి నుండి వెళ్లగొట్టారని, వారితోపాటు  తంబీ అనే వ్యక్తి తన రెండు కాసుల బంగారు గొలుసును దొంగలించారని తనకు న్యాయం చేయాలని కోరారు. లింగపాలెం నకు చెందిన భీమిరెడ్డి సర్వేశ్వర రెడ్డి తనకు 36 సెంట్లు పొలం ఉందని కానీ రీసర్వే అనంతరం 28 సెంట్లు గుర్తించారని, తన భూమి వివరాలు సరిచేయాలనీ కోరారు. 

కామవరపు కోట మండలం ఉప్పలపాడు కు చెందిన కూరపాటి పూర్ణచంద్రరావు  తనకు 21 సెంట్లు పొలం ఉందని కానీ రీసర్వే అనంతరం 19 సెంట్లు గుర్తించారని, తన భూమి వివరాలు సరిచేయాలనీ కోరారు. జంగారెడ్డిగూడెం మండలం దేవులపల్లి కి చెందిన ప్రగడ వెంకటలక్ష్మి తనకు ప్రాణహాని ఉందని రక్షణ కల్పించాలని కోరారు. ముసునూరు మండలం బలివే శివారు రంగంపేటకు చెందిన చేబత్తిన  లక్ష్మి తనకు తల్లికి వందనం నిధులు జమ పడలేదని మంజూరు చేయాలని, తన భర్త చనిపోయారని వితంతు పెన్షన్ మంజూరు చేయవలసిందిగా కోరారు. 

జంగారెడ్డిగూడెం మండలం గొల్లగూడెం గ్రామానికి చెందిన ములకల స్వామి తన చెల్లి నాగచరణ్యశ్రీ కి ప్రభుత్వ పాఠశాలలో విద్య అందించాలని, హాస్టల్ సీటు అందించాలని కోరారు. టీ నర్సాపురం మండలం రాజు పోతేపల్లి గ్రామానికి చెందిన జొన్నకూటి ఏసుబాబు తన కుమారుడు మైకేల్ బాబుకు 8వ తరగతిలో గురుకుల పాఠశాలలో సీటు మంజూరు చేయవలసిందిగా కోరారు. ముసునూరు మండలం గొల్లపూడి గ్రామానికి చెందిన ఎల్. డేవిడ్ తన కుమారుడు రాకేష్   పెదవేగి  గురుకుల పాఠశాలలో సీటు మంజూరు చేయవలసిందిగా కోరారు. 

కొయ్యలగూడెం మండలం కన్నాపురం గ్రామానికి చెందిన నైనారపు రత్నకుమారి తన కుమారుడి శాత్విక్ కి ప్రభుత్వ స్కూలు లో సీటు, హాస్టల్ సీటు మంజూరు చేయవలసిందిగా కోరారు.  ఏలూరు కి చెందిన పెదపూడి లీలమ్మ తన భర్త చనిపోయాడని తనకు ఎటువంటి ఆధారం లేదని స్వంత ఇల్లు మంజూరు చేయవలసిందిగా కోరారు. ఈ కార్యక్రమంలో జిల్లా వివిధ శాఖలు అధికారులు, తదితరులు పాల్గొన్నారు. 
WhatsApp "𝘽𝘾𝙉 𝙏𝙑" Group Join Now
Telegram "𝘽𝘾𝙉 𝙏𝙑" Group Join Now