ఏలూరు జిల్లా, ఆగస్టు 12: కుక్కునూరు పోలీస్ స్టేషన్ పరిధిలో వృద్ధ మహిళపై దాడి చేసి, ఆమె మెడలోని బంగారు నానుతాడును బలవంతంగా లాక్కొని పరారైన కేసును పోలీసులు ఛేదించారు. కుక్కునూరు పోలీస్ స్టేషన్‌లో నమోదైన Cr.No.76/2026 U/s 134, 307 BNS కేసులో నలుగురు నిందితులను పోలీసులు అరెస్ట్ చేశారు. కేసు దర్యాప్తులో భాగంగా ఆగస్టు 12న ఉదయం సుమారు 9 గంటల సమయంలో కుక్కునూరు మండలం వెంకటాపురం గ్రామంలోని తిమ్మంపేట అడ్డరోడ్డు వద్ద అనుమానాస్పదంగా సంచరిస్తున్న ముగ్గురు పురుషులు, ఒక మహిళను పోలీసులు గుర్తించారు. పోలీసులను చూసి అక్కడి నుంచి తప్పించుకునేందుకు ప్రయత్నించడంతో వారిని వెంబడించి అదుపులోకి తీసుకున్నారు.
అరెస్టు చేసిన నిందితుల్లో జంగారెడ్డిగూడెంకు చెందిన షేక్ ఖాసిం అలియాస్ భాషా అలియాస్ జటాలు (26), వాసంశెట్టి రామచంద్ర పవన్ కుమార్ అలియాస్ స్కైలాబ్ (19), నలుబోలు లోకేష్ (27), తెలంగాణ రాష్ట్రం భద్రాద్రి కొత్తగూడెం జిల్లా బూర్గంపహాడ్ మండలం బుట్టా లక్ష్మీపురం గ్రామానికి చెందిన పాయం రుతు (26) ఉన్నారు. వీరిలో షేక్ ఖాసింపై జంగారెడ్డిగూడెం పోలీస్ స్టేషన్ పరిధిలో 13 కేసులు, కొయ్యలగూడెం పరిధిలో 2 కేసులు, నల్లజర్ల పరిధిలో ఒక కేసు కలిపి మొత్తం 17 కేసులు నమోదై ఉన్నట్లు పోలీసులు తెలిపారు. పవన్ కుమార్‌పై జంగారెడ్డిగూడెం పరిధిలో 9 కేసులు, కొయ్యలగూడెం పరిధిలో ఒక కేసు కలిపి మొత్తం 10 కేసులు నమోదై ఉన్నాయని వెల్లడించారు. నలుబోలు లోకేష్‌పై జంగారెడ్డిగూడెం పోలీస్ స్టేషన్ పరిధిలో మూడు కేసులు ఉన్నట్లు పోలీసులు తెలిపారు.
దర్యాప్తులో వెల్లడైన వివరాల ప్రకారం, నిందితులు డబ్బుల అవసరం కారణంగా దొంగతనం చేయాలని నిర్ణయించుకుని TS 03 ET 4530 నంబర్ గల తెలుపు రంగు మారుతి సుజుకి కారులో ప్రయాణించారు. కుక్కునూరు మీదుగా వెళ్తున్న సమయంలో ఒంటరిగా నడుచుకుంటూ వెళ్తున్న వృద్ధ మహిళను గుర్తించి, కారును ఆపి ఆమెను అడ్డగించారు. అనంతరం ఆమెను బెదిరించి దాడి చేసి, మెడలో ఉన్న సుమారు మూడు కాసుల బంగారు నానుతాడును బలవంతంగా లాక్కున్నారు. ఈ ఘటనను అడ్డుకునేందుకు ప్రయత్నించిన మహిళ అల్లుడిని కూడా తోసివేసి, చంపేస్తామని బెదిరించి అక్కడి నుంచి కారులో పరారయ్యారు.
పరారయ్యే క్రమంలో నిందితులు ప్రయాణిస్తున్న కారు వెంకటాపురం గ్రామంలోని తిమ్మంపేట రోడ్డువైపు వెళ్తుండగా అదుపుతప్పి రోడ్డు పక్కన ఉన్న చెట్టును ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో కారు ముందు ఎడమ వైపు టైరు ప్రాంతంలో నష్టం ఏర్పడినట్లు దర్యాప్తులో తేలింది. అనంతరం నిందితులు వాహనాన్ని సమీపంలోని అటవీ ప్రాంతంలో దాచిపెట్టి అక్కడి నుంచి పరారైనట్లు పోలీసులు గుర్తించారు. నిందితుల వద్ద నుంచి బాధితురాలి బంగారు నానుతాడును పోలీసులు స్వాధీనం చేసుకున్నారు, పూసలతో కలిపి దాని బరువు సుమారు 21.600 గ్రాములుగా ఎలక్ట్రానిక్ వేయింగ్ మెషిన్ ద్వారా నిర్ధారించారు. అదేవిధంగా నేరానికి ఉపయోగించిన TS 03 ET 4530 నంబర్ గల తెలుపు రంగు మారుతి సుజుకి కారును కూడా మధ్యవర్తుల సమక్షంలో స్వాధీనం చేసుకున్నారు.
ఆగస్టు 12న ఉదయం 11.30 గంటలకు నలుగురు నిందితులను అరెస్ట్ చేసి రిమాండ్ నిమిత్తం జంగారెడ్డిగూడెం కోర్టులో హాజరుపరిచినట్లు పోలీసులు తెలిపారు. కేసులో దర్యాప్తు కొనసాగుతోందని వెల్లడించారు. ఈ కేసును చురుకుగా దర్యాప్తు చేసి, నిందితులను త్వరితగతిన అరెస్ట్ చేయడంతో పాటు దొంగిలించబడిన బంగారు నానుతాడు, నేరానికి ఉపయోగించిన వాహనాన్ని స్వాధీనం చేసుకున్న కుక్కునూరు సీఐ పి. బాల సురేష్ బాబు, ఎస్‌ఐ కె. రాజా రెడ్డి, పోలీసు సిబ్బందిని జిల్లా ఎస్పీ ప్రత్యేకంగా అభినందించారు. నేరాల నియంత్రణలో భాగంగా పోలీసులు అప్రమత్తంగా పనిచేస్తూ, నిందితులను చట్టపరంగా ఎదుర్కొంటున్నారని అధికారులు తెలిపారు. ప్రజలు అప్రమత్తంగా ఉండటంతో పాటు అనుమానాస్పద వ్యక్తులు లేదా వాహనాల సమాచారం ఉంటే వెంటనే పోలీసులకు తెలియజేయాలని సూచించారు.
