ఎన్‌టీఆర్ జిల్లా, BCN NEWS, ఏప్రిల్ 20: ప్రపంచ వారసత్వ దినోత్సవాన్ని పురస్కరించుకుని ఈ నెల 18న ప్రారంభమైన కొండపల్లి బొమ్మల పండగ మూడు రోజుల పాటు అంగరంగ వైభవంగా నిర్వహించి విజయవంతంగా ముగిసింది. ఈ ఉత్సవాలు కొండపల్లి బొమ్మకు, స్థానిక కళాకారులకు కొత్త ఉత్తేజాన్ని అందించాయి. చివరి రోజు కార్యక్రమాల్లో రాష్ట్ర పర్యాటక శాఖ మంత్రి కందుల దుర్గేష్, రాష్ట్ర సమాచార పౌర సంబంధాల శాఖ సంచాలకులు కేఎస్ విశ్వనాథన్, మైలవరం ఎమ్మెల్యే వసంత వెంకట కృష్ణప్రసాద్, జిల్లా కలెక్టర్ డా. జి. లక్ష్మీశ తదితరులు పాల్గొని కళాకారులను ప్రోత్సహించారు.
మూడవ రోజు కార్యక్రమాల్లో మార్కెటింగ్, వ్యాపార అవకాశాలపై చర్చలు నిర్వహించడంతో పాటు సందర్శకుల కోసం రోప్ పుల్లింగ్, మ్యూజికల్ చైర్స్, లెమన్ అండ్ స్పూన్, గోనెసంచి పరుగు వంటి వినోదాత్మక పోటీలు నిర్వహించారు. బొమ్మల ప్రేరణతో పిల్లల ఫ్యాషన్ షో, “పవర్ విమెన్ ఆఫ్ కొండపల్లి”, పిండివంటల ప్రదర్శనలు, సాంస్కృతిక కార్యక్రమాలు సందర్శకులను ఆకట్టుకున్నాయి. పోటీల్లో విజేతలకు బహుమతులు అందజేశారు.
ఈ సందర్భంగా సమాచార పౌర సంబంధాల శాఖ సంచాలకులు కేఎస్ విశ్వనాథన్ మాట్లాడుతూ కొండపల్లి బొమ్మ మన గొప్ప వారసత్వానికి ప్రతీక అని, ఈ సంపదను సంరక్షించుకోవడం ప్రతి ఒక్కరి బాధ్యత అని అన్నారు. హస్తకళాకారుల సంక్షేమం, వారసత్వ కళల పరిరక్షణకు ప్రభుత్వం ప్రత్యేక చర్యలు తీసుకుంటోందని పేర్కొన్నారు. పర్యాటక రంగ అభివృద్ధిలో భాగంగా ఇలాంటి ఉత్సవాలు కీలక పాత్ర పోషిస్తాయని చెప్పారు.
జిల్లా కలెక్టర్ డా. జి. లక్ష్మీశ మాట్లాడుతూ ఈ పండగకు రాష్ట్రవ్యాప్తంగా విశేష స్పందన లభించిందని తెలిపారు. మూడు రోజులపాటు వేలాదిగా ప్రజలు పాల్గొని కళాకారులకు ప్రోత్సాహం అందించారని చెప్పారు. సుమారు 400 ఏళ్ల చరిత్ర కలిగిన కొండపల్లి బొమ్మకు ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు తీసుకురావడమే ఈ కార్యక్రమం లక్ష్యమని పేర్కొన్నారు. ఈ ఉత్సవాల విశేషాలను పుస్తక రూపంలో ప్రచురించనున్నట్లు తెలిపారు.
మైలవరం ఎమ్మెల్యే వసంత వెంకట కృష్ణప్రసాద్ మాట్లాడుతూ కొండపల్లి బొమ్మలు మన సంస్కృతి, సంప్రదాయాలకు ప్రతీకగా నిలుస్తున్నాయని, ఈ కళను ప్రపంచవ్యాప్తంగా విస్తరించేందుకు ఇలాంటి పండుగలు దోహదపడతాయని అన్నారు. కార్యక్రమంలో స్థానిక ప్రజాప్రతినిధులు, అధికారులు, కళాకారులు, కళాభిమానులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.
