విభజన చట్టం అమలుపై ఆగ్రహం


ఆంధ్రప్రదేశ్, BCN NEWS ఏప్రిల్ 14: రాయలసీమ అభివృద్ధిలో రాష్ట్ర ప్రభుత్వాలు ఘోరంగా విఫలమయ్యాయని రాయలసీమ సాగునీటి సాధన సమితి అధ్యక్షులు బొజ్జ దశరథ రామిరెడ్డి విమర్శించారు. మంగళవారం నిర్వహించిన రాయలసీమ ప్రజాసంఘాల సమావేశంలో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొని మాట్లాడుతూ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర విభజన చట్టం–2014లో రాయలసీమకు కల్పించాల్సిన హక్కులు ఇప్పటికీ అమలు కాలేదని ఆగ్రహం వ్యక్తం చేశారు.


అమరావతి రాజధాని పేరుతో అభివృద్ధి అంటూ ప్రచారం చేస్తున్నప్పటికీ, వాస్తవానికి ఆ కలల రాజధాని రాష్ట్ర ఆర్థిక వ్యవస్థపై భారంగా మారిందని విమర్శించారు. అమరావతి అభివృద్ధిపై అధికంగా దృష్టి పెట్టడం వల్ల ఇతర ప్రాంతాలు ముఖ్యంగా రాయలసీమ వెనుకబడిందని పేర్కొన్నారు. అలాగే పోలవరం ప్రాజెక్ట్ నిర్మాణ బాధ్యతలను రాష్ట్రం భుజాన వేసుకోవడంతో ఖజానా ఖాళీ అయి అప్పులు పెరిగాయని ఆరోపించారు.

ఈ ఆర్థిక ఒత్తిడుల కారణంగా రాయలసీమలో సాగునీటి రంగం సహా పలు రంగాలు తీవ్రంగా నష్టపోయాయని తెలిపారు. ఆరుతడి పంటలు అయిన మొక్కజొన్న, సెనగ, కంది, వేరుశనగలకు కనీస మద్దతు ధర కల్పించడంలో ప్రభుత్వం విఫలమైందని అన్నారు. వర్షాల కారణంగా నష్టపోయిన పంటలకు ఇన్‌పుట్ సబ్సిడీలు అందించడంలో నిర్లక్ష్యం చూపిందని, ఉద్యానవన పంటలకు సరైన ప్రోత్సాహం లేకపోవడం రైతులకు ఇబ్బందులు కలిగించిందని విమర్శించారు.

ఇకనైనా రాష్ట్ర ప్రభుత్వం విభజన చట్టం ప్రకారం రాయలసీమ అభివృద్ధికి ప్రత్యేక ప్యాకేజీ కేటాయించాలని, గుంతకల్లు రైల్వే జోన్, కడప ఉక్కు కర్మాగారం, గాలేరు–నగరి, హంద్రీ–నీవా, వెలుగొండ వంటి కీలక ప్రాజెక్టులను తక్షణమే పూర్తి చేయాలని డిమాండ్ చేశారు.

అలాగే సిద్ధేశ్వరం అలుగు ప్రజా శంకుస్థాపన 10వ వార్షికోత్సవాన్ని మే 31, 2026న నంద్యాలలో ఘనంగా నిర్వహించనున్నట్లు తెలిపారు. ఈ సందర్భంగా భారీ బహిరంగ సభ ఏర్పాటు చేసి ప్రభుత్వ వైఫల్యాలను ప్రజల్లోకి తీసుకెళ్లాలని నిర్ణయించారు. రాయలసీమ ప్రజలు పెద్ద ఎత్తున పాల్గొని ఈ సభను విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు.

ఈ సమావేశంలో రాయలసీమ ప్రజాసంఘాల నాయకులు, సమితి ప్రతినిధులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.
WhatsApp "𝘽𝘾𝙉 𝙏𝙑" Group Join Now
Telegram "𝘽𝘾𝙉 𝙏𝙑" Group Join Now