WORLD NEWS: అంతర్జాతీయ స్థాయిలో జరిగే ఒప్పందాల్లో ప్రతి పదం, ప్రతి అక్షరం ఎంతో కీలకం. అలాంటి సందర్భంలో ఇరాన్ ప్రతిపాదించిన సీజ్‌ఫైర్ ఒప్పందంలో వెలుగుచూసిన భాషా వ్యత్యాసాలు ప్రపంచవ్యాప్తంగా చర్చనీయాంశంగా మారాయి.
ప్రముఖ వార్తా సంస్థ అసోసియేటెడ్ ప్రెస్ కథనం ప్రకారం, ఈ ఒప్పందంలోని పార్సీ (ఫార్సీ) మరియు ఇంగ్లీష్ వెర్షన్ల మధ్య కీలక తేడాలు బయటపడ్డాయి. ముఖ్యంగా యురేనియం శుద్ధి అంశంలో ఈ వ్యత్యాసాలు తీవ్ర సందేహాలకు దారితీశాయి.
పార్సీ వెర్షన్‌లో “యురేనియం శుద్ధిపై ఇరాన్‌కు ఉన్న సార్వభౌమ హక్కును అంతర్జాతీయ సమాజం గుర్తించాలి” అనే నిబంధన స్పష్టంగా ఉండగా, అదే అంశం ఇంగ్లీష్ వెర్షన్‌లో కనిపించకపోవడం ఆశ్చర్యానికి గురిచేస్తోంది. యురేనియం అనేది అణు ఆయుధాల తయారీలో కీలక అంశం కావడంతో, ఈ తేడా వ్యూహాత్మకంగా ఎంతో ప్రాధాన్యం సంతరించుకుంది.
ఇంగ్లీష్ పత్రాన్ని ఆధారంగా తీసుకుని డొనాల్డ్ ట్రంప్ నేతృత్వంలోని అమెరికా ప్రతినిధులు ఒప్పందాన్ని అంగీకరించి ఉంటే, ఇరాన్ మాత్రం తన స్థానిక భాషా పత్రం ద్వారా తాను కోరుకున్న ప్రయోజనాన్ని సాధించుకున్నట్టే అవుతుంది.
ఈ పరిణామం ట్రంప్ నిర్ణయాలపై, ఆయన బృందం పనితీరుపై విమర్శలకు దారితీసింది. అంతర్జాతీయ ఒప్పందాల్లో భాషా అనువాదాలను సమగ్రంగా పరిశీలించకపోవడం ఒక పెద్ద లోపంగా విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.
కొంతమంది విశ్లేషకుల అభిప్రాయం ప్రకారం, ఇది ఇరాన్ వ్యూహాత్మక తెలివితేటలకు ఉదాహరణగా నిలిచింది. ఒకే ఒప్పందాన్ని రెండు భాషల్లో వేర్వేరు అర్థాలతో రూపొందించడం ద్వారా ప్రపంచానికి శాంతి సంకేతాలు పంపుతూనే, తన అణు హక్కులను కాపాడుకునే ప్రయత్నం చేసింది.
ఈ ఘటన అంతర్జాతీయ దౌత్యరంగానికి ఒక గట్టి హెచ్చరికగా నిలిచింది. భవిష్యత్తులో ఇలాంటి ఒప్పందాలపై సంతకం చేసే ముందు ప్రతి అంశాన్ని లోతుగా పరిశీలించడం ఎంత అవసరమో ఈ సంఘటన స్పష్టం చేస్తోంది.
