2027 వరకు గడ్డు కాలమే.. ఆందోళనలో శాస్త్రవేత్తలు..


‘సూపర్ ఎల్ నినో’ హెచ్చరిక.. 2027 వరకు పెను వాతావరణ సవాళ్లు


WORLD NEWS: ప్రపంచ వాతావరణ పరిస్థితుల్లో కీలక మార్పులకు దారితీసే ఎల్ నినో ప్రభావం ఈసారి మరింత తీవ్రంగా ఉండబోతోందని శాస్త్రవేత్తలు హెచ్చరిస్తున్నారు. పసిఫిక్ సముద్రం అసాధారణంగా వేడెక్కుతున్న నేపథ్యంలో ‘సూపర్ ఎల్ నినో’ రూపంలో ఇది ఉద్ధృతం అవుతుందని అంచనా వేస్తున్నారు.

2026 ప్రారంభం నుంచే వాతావరణ మార్పుల సంకేతాలు కనిపిస్తున్నాయని, 2027 నాటికి ఇవి పతాక స్థాయికి చేరే అవకాశం ఉందని నిపుణులు చెబుతున్నారు. సాధారణ ఎల్ నినో కంటే ఇది బలమైనదిగా ఉండి, గత 140 ఏళ్లలో లేని స్థాయిలో ఉష్ణోగ్రతలు పెరిగే అవకాశముందని హెచ్చరిస్తున్నారు.

దీని ప్రభావంగా ఎండలు తీవ్రరూపం దాల్చడం, భూగర్భ జలాలు తగ్గిపోవడం, వ్యవసాయం దెబ్బతినడం వంటి పరిస్థితులు ఎదురయ్యే అవకాశం ఉంది. ముఖ్యంగా భారతదేశం వంటి వ్యవసాయాధారిత దేశాలపై దీని ప్రభావం ఎక్కువగా ఉండనుంది. రుతుపవనాలు బలహీనపడి వర్షపాతం తగ్గిపోవడం వల్ల 2026–2027 ఖరీఫ్ పంటలకు నష్టం కలగవచ్చని అంచనా.

మధ్య, వాయువ్య భారతదేశంలో కరవు పరిస్థితులు ఏర్పడే ప్రమాదం ఉంది. దీని ప్రభావంగా ఆహార ధాన్యాల ఉత్పత్తి తగ్గి ధరలు పెరిగే అవకాశం ఉండటంతో సామాన్యులపై భారం పడనుంది.

అంతేకాకుండా, 2027 సంవత్సరం మానవ చరిత్రలోనే అత్యంత వేడి సంవత్సరంగా నమోదయ్యే అవకాశం 90 శాతం వరకు ఉందని వాతావరణ నిపుణులు చెబుతున్నారు. సముద్ర ఉష్ణోగ్రతలు సాధారణ స్థాయికి మించి 2 డిగ్రీల సెల్సియస్ పెరగడం వల్ల గ్లోబల్ వార్మింగ్ మరింత వేగం పెరుగుతుంది. నగరాల్లో హీట్ వేవ్స్ పెరిగి ప్రజల ఆరోగ్యంపై తీవ్ర ప్రభావం చూపే అవకాశం ఉంది.

ప్రపంచవ్యాప్తంగా ఈ ప్రభావం అసమానంగా కనిపిస్తుంది. ఒకవైపు ఆసియా, ఆస్ట్రేలియా దేశాలు కరవు, అడవి మంటలతో ఇబ్బందులు పడితే.. మరోవైపు దక్షిణ అమెరికాలోని పెరూ, ఈక్వెడార్ వంటి దేశాలు భారీ వర్షాలు, వరదలను ఎదుర్కొనే పరిస్థితి నెలకొంటుంది.

దక్షిణ భారతదేశంలోని నగరాల్లో ఇప్పటికే నీటి ఎద్దడి కనిపిస్తుండగా, ఇది 2027 నాటికి మరింత తీవ్రమయ్యే అవకాశం ఉంది. నదులు, చెరువులు, డ్యాముల్లో నీటి మట్టాలు తగ్గిపోవడం వల్ల తాగునీటి సమస్యలు తలెత్తే ప్రమాదం ఉంది.

ఈ నేపథ్యంలో నీటి సంరక్షణ, వర్షపు నీటి నిల్వ, పర్యావరణ పరిరక్షణ వంటి చర్యలు తీసుకోవాలని నిపుణులు సూచిస్తున్నారు. ‘సూపర్ ఎల్ నినో’ కేవలం వాతావరణ మార్పు మాత్రమే కాకుండా, భవిష్యత్ జీవన విధానాన్ని ప్రభావితం చేసే పెద్ద సవాల్‌గా మారబోతోందని హెచ్చరిస్తున్నారు.
WhatsApp "𝘽𝘾𝙉 𝙏𝙑" Group Join Now
Telegram "𝘽𝘾𝙉 𝙏𝙑" Group Join Now