ఏలూరు, BCN NEWS, ఏప్రిల్ 15: జిల్లాలో అమలు జరుగుతున్న ‘నీటి భద్రత- సాగునీటి సంఘాల బాధ్యత’ కార్యక్రమం నిర్వహణలో నిర్లక్ష్యం వహించే అధికారులపై కఠిన చర్యలు తీసుకుంటామని జిల్లా కలెక్టర్ కె. వెట్రిసెల్వి ఇరిగేషన్ శాఖ అధికారులను హెచ్చరించారు.
స్థానిక కలెక్టరేట్‌లోని గౌతమీ సమావేశపు హాలులో నిర్వహించిన సమీక్షా సమావేశంలో గ్రామాల్లో చేపట్టవలసిన నీటి సంరక్షణ పనులపై ప్రతిపాదనలను అధికారులతో కలెక్టర్ సమీక్షించారు. ఈ సందర్భంగా అన్నమయ్య జిల్లాలో అమలు అవుతున్న ‘జలధార’ కార్యక్రమం తరహాలో భూగర్భ జలాల స్థాయిని పెంచేందుకు చేపట్టాల్సిన చర్యలపై ప్రశ్నించగా, అధికారులు సరైన సమాధానాలు ఇవ్వలేకపోవడంతో కలెక్టర్ తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు.
రాష్ట్ర ప్రభుత్వం కరువు పరిస్థితులు లేకుండా ఉండేలా నీటి పరిరక్షణకు ఈ కార్యక్రమాన్ని అత్యంత ప్రతిష్టాత్మకంగా అమలు చేస్తోందని, ఇలాంటి కీలక కార్యక్రమాల్లో నిర్లక్ష్యం సహించబోదని స్పష్టం చేశారు. గ్రామాల్లో నీటి వనరుల మిగులు-లోటు పరిస్థితులపై సవివర ప్రతిపాదనలు సాయంత్రం లోపు సమర్పించాలని, అలాగే ఓ అండ్ ఎం పనులకు సంబంధించిన ప్రణాళికలను వెంటనే అందించాలని ఆదేశించారు.
డికెన్స్ ఫార్ములాపై అవగాహన లోపం..
వర్షపు నీటి పరిరక్షణలో భాగంగా గరిష్ట నీటి విడుదల అంచనా కోసం ఉపయోగించే ‘డికెన్స్ ఫార్ములా’పై ఇంజినీర్లను ప్రశ్నించగా, ఎవరూ సరైన సమాధానం ఇవ్వలేకపోవడం పట్ల కలెక్టర్ ఆగ్రహం వ్యక్తం చేశారు. పనిపై పూర్తి అవగాహన లేకపోవడం తగదని, లక్ష్యాలను నిర్దేశిత గడువులో పూర్తి చేసేలా పనితీరును మెరుగుపరచుకోవాలని సూచించారు.
ఈ సమావేశంలో ఇరిగేషన్ శాఖ ఎస్ఈ దేవప్రకాష్, భూగర్భ జల శాఖ డిడీ కోదండరావు, ఈఈలు, డీఈలు, ఏఈలు పాల్గొన్నారు.

