నిజామాబాద్, BCN NEWS ఏప్రిల్ 15: రోడ్డు ప్రమాదాల నియంత్రణ కోసం రాష్ట్రవ్యాప్తంగా విస్తృత స్థాయిలో అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తున్నామని రాష్ట్ర రవాణా, బీసీ సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ తెలిపారు. ప్రభుత్వం చేపట్టిన ప్రజా పాలన ప్రగతి ప్రణాళిక 99 రోజుల కార్యాచరణలో భాగంగా “అరైవ్ అలైవ్” పేరుతో ఈ కార్యక్రమాలు కొనసాగుతున్నాయని పేర్కొన్నారు.
నిజామాబాద్ పర్యటనకు వచ్చిన మంత్రికి జిల్లా కలెక్టర్ ఇలా త్రిపాఠి, పోలీస్ కమిషనర్ సాయి చైతన్యతో పాటు ఇతర అధికారులు ఘన స్వాగతం పలికారు. హెలిప్యాడ్ వద్దకు చేరుకున్న మంత్రిని అధికారులు పుష్పగుచ్ఛాలతో ఆహ్వానించారు.
అనంతరం ప్రభుత్వ పాలిటెక్నిక్ కళాశాల వద్ద నిర్వహించిన కార్యక్రమంలో భాగంగా రోడ్డు భద్రతపై అవగాహన కల్పించేందుకు చేపట్టిన బైక్ ర్యాలీని మంత్రి జెండా ఊపి ప్రారంభించారు. ఈ ర్యాలీ కంటేశ్వర్ బైపాస్ చౌరస్తా వరకు కొనసాగింది. అక్కడ విద్యార్థులతో కలిసి మానవహారం నిర్వహించారు.
ఈ కార్యక్రమంలో రూరల్ ఎమ్మెల్యే డాక్టర్ భూపతి రెడ్డి, నగర మేయర్ ఉమారాణి, ప్రత్యేక ప్రధాన కార్యదర్శి వికాస్ రాజ్, ఆర్టీసీ ఎండీ నాగిరెడ్డి, రాష్ట్ర వ్యవసాయ కమిషన్ సభ్యుడు గడుగు గంగాధర్ తదితరులు పాల్గొన్నారు.
ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ అతివేగం, ట్రాఫిక్ నిబంధనల ఉల్లంఘన వల్లే ఎక్కువగా ప్రమాదాలు జరుగుతున్నాయని, ప్రజల్లో అవగాహన పెరగకపోతే ప్రమాదాలను పూర్తిగా అరికట్టడం కష్టమని అన్నారు. అందుకే పోలీస్, రవాణా శాఖల ఆధ్వర్యంలో “అరైవ్ అలైవ్” కార్యక్రమాలు నిర్వహిస్తున్నామని తెలిపారు.
రోడ్డు ప్రమాదాల్లో గాయపడిన వారిని వెంటనే ఆసుపత్రికి తరలించే వారికి “రహ్ వీర్” పథకం కింద రూ.25 వేల ప్రోత్సాహకం అందిస్తామని వెల్లడించారు. ముఖ్యంగా యువత, విద్యార్థులు ట్రాఫిక్ నిబంధనలు తప్పనిసరిగా పాటించాలని, జాగ్రత్తగా వాహనాలు నడపాలని మంత్రి సూచించారు.
ఈ కార్యక్రమాల్లో ప్రజాప్రతినిధులు, అధికారులు, విద్యార్థులు భారీగా పాల్గొన్నారు.
