హుజూర్‌నగర్, BCN NEWS: డివిజన్ కార్యాలయం ముందు విద్యుత్ శాఖ ఆర్టిజన్ జేఏసీ ఆధ్వర్యంలో కొనసాగుతున్న నిరవధిక సమ్మె మంగళవారం 7వ రోజుకు చేరుకుంది. ఏప్రిల్ 8 నుంచి ప్రారంభమైన ఈ సమ్మెలో ట్రాన్స్కో, జన్కో, డిస్కం సంస్థల్లో పనిచేస్తున్న సుమారు 20 వేల మంది ఆర్టిజన్ ఉద్యోగులు, కాంట్రాక్ట్, ఔట్సోర్సింగ్ కార్మికులు పాల్గొంటున్నారు. తమ న్యాయమైన డిమాండ్ల పరిష్కారం కోసం ఈ సమ్మె కొనసాగుతోందని నాయకులు తెలిపారు.
సమ్మెకు ముందు ఉద్యోగులు పలుమార్లు ప్రభుత్వానికి, సంబంధిత శాఖ ఉన్నతాధికారులకు వినతిపత్రాలు సమర్పించినప్పటికీ ఎలాంటి స్పందన రాకపోవడంతో సమ్మెకు దిగాల్సి వచ్చిందని పేర్కొన్నారు. ఉద్యోగుల డిమాండ్లు కొత్తవి కాకుండా గత ప్రభుత్వ హామీలు, అలాగే ప్రస్తుత ప్రభుత్వ ఎన్నికల వాగ్దానాల అమలు కోసమేనని తెలిపారు.
ఉద్యోగులు ప్రధానంగా మూడు డిమాండ్లు ముందుకు తెచ్చారు. విద్యార్హతల ఆధారంగా ఆర్టిజన్ ఉద్యోగులను కన్వర్ట్ చేసి సంబంధిత నియమావళిని అమలు చేయాలని, 2016 డిసెంబర్ 4కు ముందు అర్హతలు ఉన్న కాంట్రాక్ట్, ఔట్సోర్సింగ్ ఉద్యోగులను సంస్థలో విలీనం చేయాలని, పీస్ రేట్ కార్మికులకు జీవో నెంబర్ 11 ప్రకారం కనీస వేతనాలు అమలు చేయాలని డిమాండ్ చేస్తున్నారు. అదనంగా బిల్ కలెక్టర్లకు గృహ జ్యోతి పథకం ద్వారా సహాయం అందించి పూర్తి పని దినాలు కల్పించాలని కోరుతున్నారు.
ఈ డిమాండ్లు రాజ్యాంగబద్ధమైనవని, చట్టబద్ధంగా పొందవలసిన హక్కులేనని నాయకులు పేర్కొన్నారు. ప్రభుత్వం తక్షణమే స్పందించి జేఏసీ నాయకత్వాన్ని చర్చలకు ఆహ్వానించి సమస్యలను పరిష్కరించాలని విజ్ఞప్తి చేశారు.
ఈ కార్యక్రమంలో కొండ నకులుడు, ఉమ్మడి జిల్లా కో-చైర్మన్ ఎం.వి.ఎన్. చార్యులు, డివిజన్ చైర్మన్ పిడతల శ్రీనివాసరావు, ఉపాధ్యక్షులు బత్తిన రామయ్య, సంయుక్త కార్యదర్శి బొమ్మపాల వేణు, కోశాధికారి డి. శంకర్, గౌరవ అధ్యక్షులు ఎన్. తిరుపతిరావు, సైదులు తదితరులు పాల్గొన్నారు.
