ఏలూరు, BCN NEWS: భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బి.ఆర్. అంబేద్కర్ దేశ ఔన్నత్యానికి ప్రతీకగా నిలిచారని సిపిఐ ఏలూరు ఏరియా సమితి కార్యదర్శి ఉప్పులూరి హేమ శంకర్ పేర్కొన్నారు. భారత కమ్యూనిస్టు పార్టీ (సిపిఐ) ఆధ్వర్యంలో అంబేద్కర్ 135వ జయంతి వేడుకలు ఘనంగా నిర్వహించారు.
ఏలూరు పాత బస్టాండ్ వద్ద అంబేద్కర్ విగ్రహం దగ్గర జై భీమ్ సేవా ట్రస్ట్ ఆధ్వర్యంలో విప్పర్తి ప్రసాదరావు అధ్యక్షతన జరిగిన కార్యక్రమంలో ఉప్పులూరి హేమ శంకర్ పాల్గొని అంబేద్కర్ విగ్రహానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులు అర్పించారు.
ఈ సందర్భంగా మాట్లాడుతూ, అంబేద్కర్ రచించిన భారత రాజ్యాంగం ద్వారా దేశ గొప్పతనాన్ని ప్రపంచానికి చాటి చెప్పారని అన్నారు. చిన్ననాటి నుంచి ఎదుర్కొన్న కుల వివక్ష, అంటరానితనం, అస్పృశ్యతలపై జీవితాంతం పోరాడిన మహోన్నత వ్యక్తి అంబేద్కర్ అని కొనియాడారు. రాజ్యాంగ రచన కమిటీ చైర్మన్‌గా అన్ని వర్గాలకు సమాన అవకాశాలు కల్పిస్తూ, కుల వివక్ష నిర్మూలనకు పలు చట్టాలు ప్రవేశపెట్టిన గొప్ప నాయకుడని పేర్కొన్నారు.
అంబేద్కర్ చూపిన మార్గాన్ని అనుసరిస్తూ ప్రజల సమస్యల పరిష్కారం కోసం సిపిఐ నిర్వహించే ఉద్యమాలలో పాల్గొనాలని పిలుపునిచ్చారు.
ఈ కార్యక్రమంలో ఏరియా సమితి సహాయ కార్యదర్శి కురెళ్ళ వరప్రసాద్, కార్యవర్గ సభ్యురాలు మావూరి విజయ, జిల్లా సమితి సభ్యులు భజంత్రీ శ్రీనివాసరావు, కార్యవర్గ సభ్యురాలు గొర్లి స్వాతి తదితరులు పాల్గొన్నారు. వారు మాట్లాడుతూ అంబేద్కర్ అనేక విశ్వవిద్యాలయాలలో ఉన్నత విద్యను అభ్యసించిన మహోన్నత మేధావి అని, కుల వివక్ష నిర్మూలన కోసం చేసిన పోరాటాలు ఎప్పటికీ స్ఫూర్తిదాయకమని తెలిపారు.
భిన్న మతాలు, కులాలు, సంస్కృతుల సమ్మేళనమైన భారతదేశాన్ని “భిన్నత్వంలో ఏకత్వం”గా నిలిపిన రాజ్యాంగం అంబేద్కర్ గొప్పతనానికి నిదర్శనమని కొనియాడుతూ, ఆయన ఆశయ సాధన కోసం సమాజంలో వివక్షకు వ్యతిరేకంగా పోరాడాలని పిలుపునిచ్చారు.
