ఏబీఎన్ ఆర్కే వ్యాఖ్యలపై వైసీపీ సమరభేరి – పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు


నంద్యాల, BCN NEWS: ఏబీఎన్ ఆంధ్రజ్యోతి అధినేత వేమూరి రాధాకృష్ణ చేసిన వ్యాఖ్యలపై వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నేతలు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ‘వీకెండ్ కామెంట్ బై ఆర్కే’ కార్యక్రమంలో మహిళలు, వైసీపీ కార్యకర్తలను కించపరిచేలా వ్యాఖ్యలు చేశారంటూ నంద్యాల రెండో పట్టణ పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు.


ఈ సందర్భంగా ఎమ్మెల్సీ ఇసాక్ బాషాతో పాటు పార్టీ నేతలు మాట్లాడుతూ రాధాకృష్ణ వ్యాఖ్యలు నైతిక విలువలకు విరుద్ధంగా ఉన్నాయని మండిపడ్డారు. మహిళల గౌరవాన్ని దెబ్బతీసేలా మాట్లాడటం అసహ్యకరమని, కేవలం రాజకీయ విమర్శలకే పరిమితం కాకుండా వ్యక్తిగత స్థాయికి దిగజారారని ఆరోపించారు.

“రాజకీయ విమర్శలు చేయాలంటే సంస్కారం ఉండాలి. మహిళల గురించి నీచంగా మాట్లాడటం జర్నలిజం కాదు” అంటూ నేతలు ఘాటుగా స్పందించారు. వెంటనే రాధాకృష్ణపై, అలాగే ఆ కార్యక్రమానికి బాధ్యులైన యాంకర్, ఎడిటర్, మేనేజ్‌మెంట్‌పై కేసులు నమోదు చేసి అరెస్ట్ చేయాలని డిమాండ్ చేశారు.

మహిళలను అవమానించేలా వ్యాఖ్యలు చేయడం లింగ సమానత్వానికి విరుద్ధమని, బాధ్యతాయుతమైన జర్నలిజం స్థానంలో వ్యక్తిత్వ హననానికి దిగడం దురదృష్టకరమని పేర్కొన్నారు. ఈ ఘటనపై రాష్ట్రవ్యాప్తంగా నిరసనలు చేపట్టేందుకు సిద్ధమవుతున్నట్లు హెచ్చరించారు.

ఈ కార్యక్రమంలో పిపి మధుసూదన్ రెడ్డి, రత్నబాబు చౌదరి, తిమ్మారెడ్డి, శశికళ రెడ్డి, శ్రీనివాసులు, సోమశేఖర్ రెడ్డి, అనిల్ అమృత్ రాజ్, రామసుబ్బయ్య తదితర నాయకులు, పెద్ద సంఖ్యలో వైసీపీ కార్యకర్తలు పాల్గొన్నారు.
WhatsApp "𝘽𝘾𝙉 𝙏𝙑" Group Join Now
Telegram "𝘽𝘾𝙉 𝙏𝙑" Group Join Now