ఆంధ్రప్రదేశ్, అమరావతి: వరుస రోడ్డు ప్రమాదాల నేపథ్యంలో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ప్రైవేటు ట్రావెల్స్‌పై దృష్టి సారించింది. ముఖ్యంగా స్లీపర్ బస్సుల వల్లే ఎక్కువ ప్రమాదాలు జరుగుతున్నాయని భావిస్తూ, వాటిపై కీలక నిర్ణయాలు తీసుకునే దిశగా అధికారులు కసరత్తు చేస్తున్నారు. హైదరాబాద్ నుంచి రాష్ట్రంలోని పలు నగరాలు, అలాగే విజయవాడ, గుంటూరు, తిరుపతి వంటి ప్రాంతాల మధ్య నడిచే ప్రైవేటు బస్సులపై ప్రత్యేకంగా పరిశీలన కొనసాగుతోంది.
నిబంధనలకు విరుద్ధంగా నడుస్తున్న స్లీపర్ బస్సులను పూర్తిగా రద్దు చేయాలనే అంశంపై ప్రభుత్వం సీరియస్‌గా చర్చిస్తున్నట్లు సమాచారం. ఒకటి రెండు రోజుల్లోనే దీనిపై అధికారిక ఆదేశాలు వెలువడే అవకాశముందని, రవాణాశాఖ ఉన్నతాధికారులు ఈ విషయాన్ని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడుతో చర్చించి తుది నిర్ణయం తీసుకునే అవకాశం ఉందని తెలుస్తోంది.
రాష్ట్రంలో ఇటీవల చోటుచేసుకున్న కర్నూలు, మార్కాపురం బస్సు ప్రమాదాలు ప్రభుత్వాన్ని ఆందోళనకు గురిచేశాయి. ఈ ఘటనల్లో బస్సుల్లో అగ్నిప్రమాదాలు సంభవించి, ప్రయాణికులు బయటపడలేక ప్రాణాలు కోల్పోయినట్లు నివేదికలు వెల్లడించాయి. ముఖ్యంగా స్లీపర్ బస్సుల్లో అత్యవసర పరిస్థితుల్లో బయటకు రావడం కష్టమవుతుండటమే ప్రాణనష్టానికి కారణమని అధికారులు గుర్తించారు.
ఇదిలా ఉండగా, ప్రైవేటు బస్సులపై పలు కఠిన నిబంధనలు అమలు చేయాలనే ప్రతిపాదనలు కూడా పరిశీలనలో ఉన్నాయి. 300 కిలోమీటర్లకు పైగా ప్రయాణించే బస్సుల్లో తప్పనిసరిగా ఇద్దరు డ్రైవర్లు ఉండాలి అనే నిబంధనను కఠినంగా అమలు చేయాలని భావిస్తున్నారు. అలాగే ఆర్టీసీ తరహాలో స్పీడ్ లిమిట్స్ విధించడం, నిర్ణీత సమయానికి ముందే గమ్యస్థానానికి చేరుకునే బస్సులపై జరిమానాలు విధించే అవకాశాలు పరిశీలిస్తున్నారు. దీనివల్ల అధిక వేగాన్ని నియంత్రించి ప్రమాదాలను తగ్గించవచ్చని అధికారులు భావిస్తున్నారు.
రాత్రిపూట నడిచే బస్సుల్లో రెండో డ్రైవర్ విశ్రాంతి తీసుకునేందుకు ప్రత్యేక సీటు రిజర్వు చేయడం, బస్సుల్లో సీసీ కెమెరాలు అమర్చడం, అగ్నిప్రమాదాలు సంభవించినప్పుడు మంటలు వ్యాపించకుండా సేఫ్టీ ఏర్పాట్లు చేయడం వంటి అంశాలపై కూడా ప్రభుత్వం దృష్టి పెట్టింది. కర్నూలు ప్రమాదం తర్వాత ఇప్పటికే రాష్ట్రవ్యాప్తంగా 50 బస్సులను సీజ్ చేసినట్లు సమాచారం.
అయితే స్లీపర్ బస్సుల పూర్తి నిషేధం అమలు సాధ్యమా అన్న సందేహాలు కూడా వ్యక్తమవుతున్నాయి. రాష్ట్రంలో నడుస్తున్న చాలా ప్రైవేటు బస్సులు ఇతర రాష్ట్రాల్లో రిజిస్ట్రేషన్ పొందినవిగా, ఆల్ ఇండియా పర్మిట్‌తో నడుస్తున్నవిగా ఉండటం వల్ల వాటిపై పూర్తిగా నిషేధం విధించడం సవాలుగా మారే అవకాశం ఉందని నిపుణులు అభిప్రాయపడుతున్నారు. అంతర్ రాష్ట్ర బస్సుల విషయంలో ప్రభుత్వం ఎలాంటి నిర్ణయం తీసుకుంటుందనేది ఇప్పుడు ఉత్కంఠగా మారింది.
