కట్నం కోసం క్రూర డిమాండ్.. డబ్బు లేదంటే కిడ్నీ ఇవ్వాలని వేధింపు!


ఉత్తరప్రదేశ్: లక్నోలో వెలుగు చూసిన వరకట్న వేధింపుల ఘటన కలకలం రేపుతోంది. డబ్బు కోసం చివరకు కిడ్నీ ఇవ్వాలని ఒత్తిడి చేసిన ఈ ఘటన సమాజాన్ని షాక్‌కు గురిచేస్తోంది.


బాధితురాలికి నిశాంత్ కుమార్తో అంగరంగ వైభవంగా వివాహం జరిగింది. పెళ్లి సమయంలో ఆమె కుటుంబం రూ.8 లక్షల నగదు, ఒక ఎస్‌యూవీ కారును కట్నంగా ఇచ్చింది. అయితే పెళ్లి అనంతరం అత్తవారింటి అసలు స్వరూపం బయటపడింది.

భర్తకు మితిమీరిన మద్యపానం కారణంగా తీవ్రమైన కిడ్నీ సమస్య ఉందని, ఈ విషయాన్ని దాచిపెట్టి పెళ్లి చేశారని బాధితురాలు ఆరోపించింది. అనంతరం భర్తకు కిడ్నీ మార్పిడి అవసరమని చెబుతూ అత్తమామలు వేధింపులు ప్రారంభించారు.

చికిత్స కోసం అదనంగా రూ.30 లక్షలు తీసుకురావాలని, లేదంటే భార్యే తన కిడ్నీని దానం చేయాలని ఒత్తిడి తెచ్చినట్లు తెలిపింది. కట్నంగా ఇచ్చిన డబ్బు సరిపోదని, మరింత డబ్బు తీసుకురావాలని ఆమెపై శారీరక, మానసిక హింస కొనసాగిందని పేర్కొంది.

ఇంకా బాధితురాలు చేసిన ఆరోపణలు మరింత షాకింగ్‌గా ఉన్నాయి. భర్త తనతో దాంపత్య జీవితం కొనసాగించలేదని, అత్తగారు బెడ్‌రూమ్‌లో పడుకునేవారని, మామగారు అనుమతి లేకుండా గదిలోకి వచ్చి ఫోటోలు తీసేవారని వెల్లడించింది.

ఈ దారుణాలను భరించలేక బాధితురాలు తన పుట్టింటికి చేరుకుని పోలీసులను ఆశ్రయించింది. కేసు నమోదు చేసిన పోలీసులు నిశాంత్ కుమార్ మరియు అతని కుటుంబ సభ్యులపై దర్యాప్తు చేపట్టారు.

ఈ ఘటనపై దేశవ్యాప్తంగా తీవ్ర విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. కట్నం కోసం ఇలాంటి అమానుష డిమాండ్లు రావడం సమాజానికి మచ్చగా నిలుస్తోంది. బాధితురాలు తనకు న్యాయం జరగాలని, బాధ్యులపై కఠిన చర్యలు తీసుకోవాలని కోరుతోంది.
WhatsApp "𝘽𝘾𝙉 𝙏𝙑" Group Join Now
Telegram "𝘽𝘾𝙉 𝙏𝙑" Group Join Now