ఆర్కే రోజాపై క్రిమినల్ కేసు దిశగా అడుగులు.. విజిలెన్స్ నివేదిక సంచలనం


ఆంధ్రప్రదేశ్, అమరావతి: ఆర్కే రోజాపై క్రిమినల్ కేసు నమోదుకు రంగం సిద్ధమైంది. వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ హయాంలో సుమారు రూ.40 కోట్ల మేర అవినీతి జరిగిందని విజిలెన్స్ అధికారులు సమర్పించిన నివేదికలో పేర్కొన్నారు. ఈ కేసుకు సంబంధించి ఏకంగా 30 వేల పేజీల నివేదికను ప్రభుత్వం ముందుంచినట్లు సమాచారం. రోజాతో పాటు యువ నాయకుడు బైరెడ్డి సిద్ధార్థ రెడ్డిపై కూడా అభియోగాలు నమోదు చేయాలని విజిలెన్స్ సూచించింది.


వైసీపీ ప్రభుత్వం అమలు చేసిన క్రీడా కార్యక్రమాల్లో భాగంగా కేంద్ర ప్రభుత్వం చేపట్టిన ఖేలో ఇండియా పథకాన్ని రాష్ట్రంలో “ఆడుదాం ఆంధ్ర” పేరుతో అమలు చేశారు. ఈ కార్యక్రమ బాధ్యతలు అప్పటి మంత్రిగా రోజాకు అప్పగించగా, ఏపీ క్రీడా ప్రాధికార సంస్థ చైర్మన్‌గా బైరెడ్డి సిద్ధార్థ రెడ్డిని నియమించారు. రాష్ట్రవ్యాప్తంగా క్రీడలను ప్రోత్సహించేందుకు క్రీడా పరికరాల కొనుగోలు, మైదానాల అభివృద్ధి, క్రీడాకారులకు సదుపాయాలు కల్పించే పనులు చేపట్టారు.

అయితే ఇదే కార్యక్రమం అవినీతికి వేదికగా మారిందని విజిలెన్స్ అధికారులు పేర్కొన్నారు. నాసిరకం క్రీడా పరికరాలను అధిక ధరలకు కొనుగోలు చేసి కమీషన్లు తీసుకున్నట్లు, మైదానాల అభివృద్ధి పేరుతో వాస్తవానికి మట్టి తరలింపునే గ్రావెల్‌గా చూపించినట్లు నివేదికలో వెల్లడించారు. క్రీడాకారులకు త్రీ స్టార్ హోటల్ భోజనాల పేరుతో సాధారణ భోజనమే అందించి భారీగా నిధులు మళ్లించినట్లు ఆరోపించారు.

మొత్తం రూ.30 కోట్ల వ్యయంతో పూర్తి చేయాల్సిన పనులను రూ.100 కోట్లుగా చూపించి భారీ అవినీతి జరిగిందని విజిలెన్స్ స్పష్టం చేసింది. ఈ వ్యవహారంపై ఇప్పటికే ఫిర్యాదులు రావడంతో నారా చంద్రబాబు నాయుడు ప్రభుత్వం విచారణకు ఆదేశించింది. తాజాగా సమర్పించిన నివేదిక ఆధారంగా రోజా, బైరెడ్డి సిద్ధార్థ రెడ్డిపై క్రిమినల్ కేసులు నమోదు చేసే దిశగా ప్రభుత్వం చర్యలు చేపడుతోంది.
WhatsApp "𝘽𝘾𝙉 𝙏𝙑" Group Join Now
Telegram "𝘽𝘾𝙉 𝙏𝙑" Group Join Now