ఆంధ్రప్రదేశ్, అమరావతి: అమరావతిలో ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడును పీవీయన్ మాధవ్ కలిసి మత్స్యకారులు, హోంగార్డుల సమస్యలపై వినతిపత్రం సమర్పించారు.
నెల్లూరు, ఒంగోలు, బాపట్ల తీరప్రాంతాల్లో తమిళనాడుకు చెందిన మత్స్యకారులు అక్రమంగా ప్రవేశించి స్థానిక మత్స్యకారులకు ఇబ్బందులు కలిగిస్తున్నారని ఆయన పేర్కొన్నారు. స్పీడ్ బోట్లతో వచ్చి మత్స్యసంపదను దోచుకోవడం, వలలు, పడవలను ధ్వంసం చేయడం, దాడులకు పాల్పడటం వంటి ఘటనలు జరుగుతున్నాయని ఆందోళన వ్యక్తం చేశారు. ఈ పరిస్థితులతో స్థానిక మత్స్యకారుల్లో భయాందోళనలు పెరిగి శాంతిభద్రతలకు భంగం కలిగే పరిస్థితి నెలకొంటోందని తెలిపారు.
ఇటీవల నెల్లూరు జిల్లా జువ్వలదిన్నె ప్రాంతంలో ఇలాంటి బోట్లను స్థానికులు పట్టుకున్నప్పటికీ, సంబంధిత అధికారులు కఠిన చర్యలు తీసుకోకుండా వాటిని విడుదల చేయడం అనుమానాలకు తావిస్తోందని పేర్కొన్నారు. అక్రమంగా ప్రవేశించే బోట్లపై వెంటనే చర్యలు తీసుకుని తీరప్రాంత భద్రతను బలోపేతం చేయాలని ప్రభుత్వాన్ని కోరారు.
అదేవిధంగా రాష్ట్ర విభజన తరువాత సుమారు 400 మంది హోంగార్డులు తమ స్వగ్రామాలకు దూరంగా పనిచేస్తున్నారని, ఆంధ్రప్రదేశ్–తెలంగాణ మధ్య పరస్పర బదిలీలు చేపట్టి వారికి ఊరట కల్పించాలని విజ్ఞప్తి చేశారు.
