ఎన్టీఆర్ జిల్లా, మైలవరం: మైలవరం నియోజకవర్గం రాజకీయంగా టీడీపీకి కంచుకోటగా పేరుంది. గతంలో దేవినేని ఉమా మహేశ్వరరావు ఇక్కడ నుంచి గెలిచి మంత్రి పదవి చేపట్టగా, 2019లో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ తొలిసారిగా ఇక్కడ పాగా వేసింది. అనంతరం 2024లో మళ్లీ తెలుగుదేశం పార్టీ విజయం సాధించింది. 2019లో వైసీపీ తరఫున గెలిచిన వసంత కృష్ణ ప్రసాద్, 2024లో టీడీపీలో చేరి అదే నియోజకవర్గం నుంచి పోటీ చేసి మరోసారి గెలుపు సాధించారు.
అయితే మైలవరం రాజకీయాల్లో ఒక ఆసక్తికరమైన సెంటిమెంట్ కొనసాగుతోంది. ఇక్కడ ప్రజలు ఒకే నాయకుడిని వరుసగా రెండు సార్లకు మించి గెలిపించిన సందర్భం లేదు. పార్టీ ఏదైనా, నాయకుడు ఎవరైనా… రెండు సార్లు గెలిపించిన తర్వాత మూడోసారి మాత్రం కొత్త నాయకత్వానికి అవకాశం ఇచ్చే ధోరణి కనిపిస్తోంది.
గత ఎన్నికల చరిత్రను పరిశీలిస్తే ఈ సెంటిమెంట్ స్పష్టంగా కనిపిస్తుంది. 1985, 1989 ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీకి వరుస విజయాలు లభించాయి. అదే విధంగా 1994, 1999 ఎన్నికల్లో టీడీపీ అభ్యర్థులు వరుసగా గెలిచారు. అయితే ఆ సమయంలో వ్యక్తిగత నాయకత్వం కంటే పార్టీ ప్రభావమే ఎక్కువగా ఉండేది.
2009, 2014 ఎన్నికల నాటికి పరిస్థితులు మారాయి. వ్యక్తిగత నాయకత్వం, సామాజిక వర్గాల ప్రభావం పెరగడంతో దేవినేని ఉమా వరుసగా రెండు సార్లు గెలిచారు. తరువాత అదే ట్రెండ్ కొనసాగుతూ 2019, 2024లో వసంత కృష్ణ ప్రసాద్ వరుస విజయాలు సాధించారు.
ఇప్పుడు ప్రశ్న ఏమిటంటే… ఈ సెంటిమెంట్ మరోసారి రిపీట్ అవుతుందా? అదే జరిగితే వచ్చే ఎన్నికల్లో మైలవరం ప్రజలు కొత్త నాయకత్వానికి మొగ్గు చూపే అవకాశం ఉంది. లేకపోతే ఈ సెంటిమెంట్‌ను బ్రేక్ చేస్తారా అన్నది ఆసక్తికరంగా మారింది. మొత్తానికి మైలవరం రాజకీయాలు మళ్లీ ఉత్కంఠ రేపుతున్నాయి.
