గాదంశెట్టి దంపతుల సేవలకు ప్రశంసలు


చర్ల, BCN NEWS: మారుమూల అటవీ ప్రాంత గ్రామాలకు చెందిన పేద ఆదివాసీ విద్యార్థుల విద్యాభ్యాసానికి సహకరిస్తున్న స్థానిక వస్త్ర వ్యాపారి గాదంశెట్టి నరసింహారావు – ప్రసన్నలక్ష్మి దంపతులు అభినందనీయులని వనవాసీ కళ్యాణ పరిషత్ కొమరం భీం విద్యార్థి నిలయం కార్యదర్శి జవ్వాది మురళీకృష్ణ అన్నారు. నరసింహారావు తండ్రి దివంగత గాదంశెట్టి బాలనర్సింహం వర్ధంతి సందర్భంగా విద్యార్థి నిలయానికి 50 కేజీల బియ్యం, విద్యార్థులకు భోజనం, పండ్లు, స్వీట్లు అందజేయడం జరిగింది.


ఈ సందర్భంగా నిలయ కమిటీ ఉపాధ్యక్షులు గోగికార్ రాంలక్ష్మణ్ అధ్యక్షతన నిర్వహించిన సమావేశంలో మురళీకృష్ణ మాట్లాడారు. గాదంశెట్టి కుటుంబం విద్యార్థుల భవిష్యత్‌ను దృష్టిలో ఉంచుకుని అందిస్తున్న సహకారం మరువలేనిదని తెలిపారు. ప్రతి సంవత్సరం తమ తల్లిదండ్రులు బాలనర్సింహం – సుబ్బలక్ష్మి దంపతుల జయంతి, వర్ధంతి సందర్భంగా విద్యార్థి నిలయానికి విరాళాలు అందిస్తూ పలువురికి ఆదర్శంగా నిలుస్తున్నారని అన్నారు.

దేశవ్యాప్తంగా వనవాసీ కళ్యాణ పరిషత్ గిరిజన విద్యార్థులు మరియు ప్రజల విద్య, ఆరోగ్యంపై ప్రత్యేక దృష్టి సారించి అనేక సేవా కార్యక్రమాలు నిర్వహిస్తోందని వివరించారు. సంస్థ ఆధ్వర్యంలో దేశవ్యాప్తంగా 245 విద్యార్థి నిలయాలను ఏర్పాటు చేసి జాతీయ భావాలు, దేశభక్తి కలిగిన విద్యార్థులను తీర్చిదిద్దుతున్నట్లు తెలిపారు. ప్రభుత్వాల నుంచి ఎటువంటి నిధులు అందకపోయినా, గాదంశెట్టి కుటుంబం వంటి దాతల సహకారంతోనే సంస్థ ముందుకు సాగుతోందని పేర్కొన్నారు.

గత రెండేళ్లుగా అనేక మంది దాతలు ముందుకు వచ్చి విద్యార్థుల చదువులకు సహకారం అందించడం సంతోషకరమని అన్నారు. భవిష్యత్తులో కూడా ఇదే విధంగా దాతలు ముందుకు వచ్చి విద్యార్థుల ఉన్నతికి తోడ్పడాలని విజ్ఞప్తి చేశారు. విద్యార్థులు కూడా దాతల సహకారాన్ని సద్వినియోగం చేసుకుని క్రమశిక్షణతో చదివి జీవితంలో ఉన్నత స్థానాలకు చేరుకోవాలని సూచించారు. విద్య ద్వారానే భవిష్యత్ ఉన్నదని గుర్తించి ముందుకు సాగాలని పిలుపునిచ్చారు.

ఈ కార్యక్రమంలో కొమరం భీం విద్యార్థి నిలయం సహ కోశాధికారి వేములపల్లి ప్రవీణ్ బాబు, కమిటీ సభ్యులు పోలిన రమాదేవి, లవన్ కుమార్ రెడ్డి, నిలయ ప్రముఖ్ గొంది ప్రసన్నకుమారి తదితరులు పాల్గొన్నారు.
WhatsApp "𝘽𝘾𝙉 𝙏𝙑" Group Join Now
Telegram "𝘽𝘾𝙉 𝙏𝙑" Group Join Now