తమిళనాడు, మదురై: రీల్‌లో కనిపించే న్యాయం, ధర్మం కోసం పోరాటం నిజ జీవితంలో చాలా అరుదుగా కనిపిస్తుంది. కానీ అలాంటి ధైర్యాన్ని చూపించి చరిత్రలో నిలిచిపోయిన ఘటన మదురైలో వెలుగుచూసింది. ఇద్దరు సామాన్యుల లాకప్ డెత్ కేసులో నిజాన్ని బయటపెట్టిన మహిళా పోలీస్ హెడ్ కానిస్టేబుల్ రేవతి, తన సాక్ష్యాలతో తొమ్మిది మంది పోలీసులకు ఉరిశిక్ష పడేలా కీలక పాత్ర పోషించారు.
లాక్‌డౌన్ సమయంలో వ్యాపారులు జయరాజ్, బెన్నిక్స్‌ను పోలీసులు అదుపులోకి తీసుకుని అమానుషంగా హింసించిన ఘటన దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించింది. పోలీస్ స్టేషన్‌లో జరిగిన ఈ దారుణాన్ని బయటకు రానీయకుండా ప్రయత్నాలు జరిగినప్పటికీ, రేవతి మాత్రం బాధితుల పక్షాన నిలబడి నిజాన్ని కోర్టు ముందు ఉంచారు. తండ్రి-కొడుకులను రాత్రంతా కొట్టినట్లు, స్టేషన్‌లో లాఠీలు, టేబుళ్లపై రక్తపు మరకలు ఉన్నాయని ఆమె వివరంగా వెల్లడించారు.
లాకప్ డెత్ తర్వాత ఆధారాలు మాయం చేసేందుకు స్టేషన్‌ను పూర్తిగా శుభ్రం చేసినప్పటికీ, ఎక్కడ ఎలాంటి రక్తపు మరకలు ఉన్నాయో రేవతి స్పష్టంగా వివరించారు. ఆమె ఇచ్చిన సమాచారంతోనే అధికారులు కీలక ఆధారాలు సేకరించగలిగారు. ఫోరెన్సిక్ సాక్ష్యాలు బలపడటానికి కూడా ఆమె చెప్పిన వివరాలు దోహదపడ్డాయి.
ఇదిలా ఉండగా, తోటి పోలీసులపై సాక్ష్యం ఇవ్వడంపై ఆమెకు తీవ్ర ఒత్తిడి ఎదురైంది. ఉన్నతాధికారుల నుంచి ఒత్తిళ్లు, సహచరుల నుంచి వ్యతిరేకత, ప్రాణహాని భయాల మధ్య కూడా ఆమె వెనుకడుగు వేయలేదు. కోర్టు విచారణ సమయంలో కూడా తగిన సహకారం అందకపోయినా, నిజం చెప్పడంలో ఎక్కడా వెనకడుగు వేయలేదు.
సాధారణంగా ఇలాంటి సందర్భాల్లో చాలా మంది మౌనం వహిస్తారు. కానీ రేవతి మాత్రం తన కళ్ల ముందు జరిగిన దారుణాన్ని దాచిపెట్టకుండా ధైర్యంగా బయటపెట్టారు. ఆమె కమిట్‌మెంట్, న్యాయం పట్ల ఉన్న నిబద్ధత దేశవ్యాప్తంగా ప్రశంసలు అందుకుంటోంది. ఇప్పుడు ఆమె ధైర్యానికి ప్రతీకగా, న్యాయం కోసం పోరాడే వారికి స్ఫూర్తిగా నిలిచారు.

