కొత్తపేట, BCN NEWS: నియోజకవర్గంలో ఫెర్టిలిటీ సంరక్షణపై అవగాహన కల్పించే లక్ష్యంతో నిర్వహిస్తున్న ‘జననీ యాత్ర’ కార్యక్రమాన్ని ఎమ్మెల్యే బండారు సత్యానందరావు ప్రారంభించారు. రావులపాలెం హైస్కూల్ వద్ద నిర్వహించిన ఈ కార్యక్రమంలో సంస్థ ప్రతినిధులు ఎమ్మెల్యేను కలిసి తమ సేవలను వివరించారు. అనంతరం ఎమ్మెల్యే జెండా ఊపి యాత్రను ప్రారంభించారు.
ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ Oasis Fertility చేపట్టిన ఈ కార్యక్రమం గ్రామీణ ప్రాంతాల్లో ఫెర్టిలిటీ సమస్యలపై అవగాహన పెంచడంలో కీలకమని అభినందించారు. రాష్ట్రంలో జననాల రేటు తగ్గిపోతున్న నేపథ్యంలో కుటుంబాలు కనీసం ఇద్దరు లేదా ముగ్గురు పిల్లలను కలిగి ఉండాలని సూచించారు. యువ జనాభా తగ్గుదల భవిష్యత్తులో సామాజిక, ఆర్థిక సమస్యలకు దారితీసే అవకాశం ఉందని పేర్కొన్నారు.
ఫెర్టిలిటీ సమస్యలను సామాజిక అపోహల కోణంలో కాకుండా వైద్యపరమైన సవాలుగా చూడాలని, సరైన ఆహారం, జీవనశైలి మార్పులు, వైద్య సేవలు తీసుకోవడం ద్వారా పరిష్కారం సాధ్యమని తెలిపారు. ఐవీఎఫ్, ఐయూఐ వంటి ఆధునిక చికిత్సలతో అనేక కుటుంబాలకు సంతోషాన్ని అందిస్తున్న ఒయాసిస్ ఫెర్టిలిటీ సేవలు గ్రామీణ ప్రాంతాలకు చేరడం శుభపరిణామమని అన్నారు.
ఈ యాత్ర ద్వారా మరింత మంది ప్రజలకు ఫెర్టిలిటీ సంరక్షణపై అవగాహన పెరిగి, అనేక కుటుంబాలు లబ్ధి పొందాలని ఎమ్మెల్యే ఆకాంక్షించారు. కార్యక్రమంలో అనపర్తి పరిశీలకులు ఆకుల రామకృష్ణ తదితరులు పాల్గొన్నారు.
