ఏలూరు, BCN NEWS, ఏప్రిల్ 19: వేసవి ఎండల తీవ్రత పెరుగుతున్న నేపథ్యంలో ప్రజల దాహార్తి తీర్చేందుకు ఏలూరులో ఉచిత మజ్జిగ చలివేంద్రాలు ఏర్పాటు చేయడం అభినందనీయమని ప్రజాప్రతినిధులు పేర్కొన్నారు. నగరంలోని 19వ డివిజన్ హనుమాన్ నగర్ వంతెన వద్ద వీరంకి పండు ఆధ్వర్యంలో, 26వ డివిజన్ శనివారపుపేట గాలిగోపురం వద్ద వాసా సాయి ఆధ్వర్యంలో ఆదివారం ఈ చలివేంద్రాలను ప్రారంభించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా ఏలూరు ఎమ్మెల్యే బడేటి చంటి, ఏపీఎస్ ఆర్టీసీ విజయవాడ జోనల్ చైర్మన్ రెడ్డి అప్పల నాయుడు హాజరయ్యారు.
కార్యక్రమం ప్రారంభానికి ముందు నాయకులను శాలువాలతో సత్కరించి ఘన స్వాగతం పలికారు. అనంతరం వారి చేతుల మీదుగా మజ్జిగ పంపిణీ కేంద్రాలను ప్రారంభించారు. గత ఐదేళ్లుగా ప్రతి వేసవిలో ఇలాంటి సేవా కార్యక్రమాలను నిర్వహిస్తున్నామని నిర్వాహకులు వీరంకి పండు, వాసా సాయి తెలిపారు.
ఈ సందర్భంగా ఎమ్మెల్యే బడేటి చంటి, రెడ్డి అప్పల నాయుడు మాట్లాడుతూ ఎండల తీవ్రత కారణంగా ప్రజలు అనేక ఇబ్బందులు పడుతున్నారని అన్నారు. పేద, ధనిక తేడా లేకుండా ప్రతి ఒక్కరి దాహార్తిని తీర్చేందుకు ఇలాంటి చలివేంద్రాలు ఎంతో ఉపయోగకరమని పేర్కొన్నారు. ముఖ్యంగా శ్రామికులు, రైతు కూలీలకు ఈ మజ్జిగ ఉపశమనం కలిగిస్తుందని తెలిపారు.
నిత్యం రద్దీగా ఉండే హనుమాన్ నగర్, శనివారపుపేట ప్రాంతాల్లో ఈ సేవలు ప్రజలకు ఎంతో ఉపయోగపడతాయని చెప్పారు. ఎండలో కష్టపడే కార్మికులకు శక్తినిచ్చే ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్న నిర్వాహకులను ప్రత్యేకంగా అభినందించారు. సమాజంలో సేవా భావాన్ని పెంపొందించే ఇలాంటి కార్యక్రమాలు మరింత విస్తరించాలన్నారు.
ఈ కార్యక్రమంలో ఏఎంసీ చైర్మన్ మామిళ్ళపల్లి పార్థసారథి, మాజీ డిప్యూటీ మేయర్ శిరిపల్లి ప్రసాద్, జనసేన మరియు ఇతర కూటమి పార్టీల నాయకులు, కార్యకర్తలు, వీర మహిళలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. ప్రజలు చలివేంద్రాల వద్ద మజ్జిగను స్వీకరించి సేవను అభినందించారు.
