ఎస్‌పీఎస్‌ఆర్ నెల్లూరు, BCN NEWS: జిల్లాలోని వేదాయపాలెం పోలీస్ స్టేషన్‌లో ఏబీఎన్ ఆంధ్రజ్యోతి అధినేత వేమూరి రాధాకృష్ణపై వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నాయకులు ఫిర్యాదు చేశారు. పార్టీ నాయకుల కుటుంబ సభ్యులు, మహిళలపై అవమానకర వ్యాఖ్యలు చేశారని ఆరోపిస్తూ చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.
ఈ ఫిర్యాదులో శాసనమండలి సభ్యుడు పర్వతరెడ్డి చంద్రశేఖర్ రెడ్డి, జిల్లా పరిషత్ చైర్‌పర్సన్ ఆనం అరుణమ్మ, నెల్లూరు రూరల్ ఇన్‌చార్జ్ ఆనం విజయ్ కుమార్ రెడ్డితో పాటు పలువురు వైసీపీ నాయకులు పాల్గొన్నారు. మాజీ మంత్రి, జిల్లా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు కాకాణి గోవర్ధన్ రెడ్డి ఈ సందర్భంగా పోలీసులకు వినతిపత్రం అందజేశారు.
ఈ సందర్భంగా కాకాణి గోవర్ధన్ రెడ్డి మాట్లాడుతూ రాధాకృష్ణ చేసిన వ్యాఖ్యలు అత్యంత హేయంగా ఉన్నాయని మండిపడ్డారు. మహిళలను ఉద్దేశించి చేసిన వ్యాఖ్యలు సభ్య సమాజం తలదించుకునేలా ఉన్నాయని విమర్శించారు. జర్నలిజం విలువలను పక్కనబెట్టి వ్యక్తిగత దూషణలకు దిగడం వృత్తికి అవమానమని అన్నారు.
పోలీసులు నిష్పక్షపాతంగా వ్యవహరించాల్సిన బాధ్యత ఉందని, కానీ ఒక పార్టీకి అనుకూలంగా ప్రవర్తిస్తున్నారనే ఆరోపణలు చేశారు. శాంతిభద్రతలను కాపాడాల్సిన వ్యవస్థ రాజకీయ ప్రయోజనాల కోసం ఉపయోగపడకూడదని హెచ్చరించారు.
రాధాకృష్ణ వ్యాఖ్యలు కేవలం రాజకీయ విమర్శలు కాకుండా మహిళల గౌరవాన్ని దెబ్బతీసే విధంగా ఉన్నాయని, ఆయనపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా చర్యలు తీసుకోవాలని కోరారు.
పోలీసుల స్పందనపై అసంతృప్తి వ్యక్తం చేస్తూ, అవసరమైతే న్యాయస్థానాలను ఆశ్రయిస్తామని తెలిపారు. మహిళల గౌరవం కోసం పోరాటం కొనసాగిస్తామని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నాయకులు స్పష్టం చేశారు.
