దేశ నాయకుల విగ్రహాలు భావితరాలకు స్ఫూర్తిదాయకం – బడేటి చంటి, గంటా పద్మశ్రీ


ఏలూరు, BCN NEWS, ఏప్రిల్ 14: దేశానికి సేవలందించిన మహనీయుల విగ్రహాలు భావితరాలకు స్ఫూర్తినిచ్చేలా నిలుస్తాయని జిల్లా టిడిపి అధ్యక్షులు, ఎమ్మెల్యే బడేటి చంటి మరియు జడ్పీ చైర్ పర్సన్ గంటా పద్మశ్రీ పేర్కొన్నారు.


భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బి.ఆర్. అంబేద్కర్ 135వ జయంతిని పురస్కరించుకుని ఏలూరు కొత్త బస్టాండ్ సమీపంలోని ఆర్టీసీ డిపో గ్యారేజ్ వద్ద ఆర్టీసీ బహుజన ఎంప్లాయిస్ ఫెడరేషన్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన జాతీయ నాయకుల విగ్రహాలను ఘనంగా ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో దెందులూరు ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్, ఆర్టీసీ విజయవాడ జోన్ చైర్మన్ రెడ్డి అప్పలనాయుడు పాల్గొన్నారు.

ఈ సందర్భంగా మహాత్మా జ్యోతిరావు పూలే విగ్రహాన్ని ఎమ్మెల్యే బడేటి చంటి, డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ విగ్రహాన్ని చింతమనేని ప్రభాకర్, బాబూ జగ్జీవన్ రామ్ విగ్రహాన్ని రెడ్డి అప్పలనాయుడు, కాన్షిరాం విగ్రహాన్ని గంటా పద్మశ్రీ ఆవిష్కరించారు.

అనంతరం జరిగిన సభలో బడేటి చంటి మాట్లాడుతూ, దేశానికి ఎనలేని సేవలందించిన నాయకుల విగ్రహాలను ప్రజా స్థలాల్లో ఏర్పాటు చేయడం ద్వారా భావితరాలకు అవి స్ఫూర్తిదాయకంగా ఉంటాయని అన్నారు. సీఎం నారా చంద్రబాబు నాయుడు నాయకత్వంలో కూటమి ప్రభుత్వం అంబేద్కర్ ఆశయాలకు అనుగుణంగా పాలన సాగుతోందని పేర్కొన్నారు.

జడ్పీ చైర్ పర్సన్ గంటా పద్మశ్రీ మాట్లాడుతూ, అణగారిన వర్గాల అభ్యున్నతి కోసం అంబేద్కర్ చేసిన కృషి అపారమని కొనియాడుతూ, ఆయన ఆశయ సాధనకు ప్రతి ఒక్కరూ కృషి చేయాలని పిలుపునిచ్చారు.

ఆర్టీసీ జోన్ చైర్మన్ రెడ్డి అప్పలనాయుడు మాట్లాడుతూ, జాతీయ నాయకులను ఆదర్శంగా తీసుకుని సమాజ అభివృద్ధికి కృషి చేయాలని సూచించారు.

ఈ కార్యక్రమంలో ఆర్టీసీ అధికారులు, ప్రజాప్రతినిధులు, ఉద్యోగ సంఘాల నాయకులు మరియు టిడిపి కార్యకర్తలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.
WhatsApp "𝘽𝘾𝙉 𝙏𝙑" Group Join Now
Telegram "𝘽𝘾𝙉 𝙏𝙑" Group Join Now