నాలుగేళ్లలోనే కోట్ల ఆస్తులు.. ఏసీ శాంతి అరెస్టుతో సంచలనం


విశాఖపట్నం/తాడేపల్లి: అక్రమాస్తుల కేసులో అరెస్టు అయిన దేవాదాయశాఖ అసిస్టెంట్ కమిషనర్ (ఏసీ) శాంతి వ్యవహారం ఆంధ్రప్రదేశ్లో తీవ్ర చర్చనీయాంశంగా మారింది. ఉద్యోగంలో చేరిన కేవలం నాలుగేళ్లలోనే భారీగా ఆస్తులు కూడగట్టారని అవినీతి నిరోధక శాఖ అధికారులు గుర్తించారు. మంగళవారం విశాఖపట్నం, తాడేపల్లి ప్రాంతాల్లో శాంతి, ఆమె కుటుంబ సభ్యుల ఇళ్లలో సోదాలు నిర్వహించిన అధికారులు ఆదాయానికి మించిన ఆస్తులను గుర్తించి ఆమెను అరెస్టు చేశారు.


సోదాల్లో భాగంగా విశాఖలో త్రీబెడ్‌రూమ్ ఫ్లాట్, తాడేపల్లిలో మూడు అంతస్థుల విల్లా, సుమారు 770 గ్రాముల బంగారం, మూడు కిలోల వెండి, ఖరీదైన కారు, మోటార్ సైకిళ్లు, విలువైన ఎలక్ట్రానిక్ వస్తువులు బయటపడ్డాయి. ఇవన్నీ అక్రమంగా సంపాదించినవేనని అధికారులు భావిస్తున్నారు. నాలుగేళ్లలోనే ఇంత భారీ స్థాయిలో ఆస్తులు కూడగట్టడం అధికారులను సైతం ఆశ్చర్యానికి గురిచేసింది.

2020లో ఏపీపీఎస్సీ ద్వారా దేవాదాయశాఖలో ఉద్యోగంలో చేరిన శాంతి, తొలి పోస్టింగ్‌గా విశాఖలో ఏసీగా బాధ్యతలు చేపట్టారు. న్యాయవాదిగా చదివి హైదరాబాద్లో కొంతకాలం పనిచేసిన ఆమె, ఆ తర్వాత విశాఖకు వచ్చి ఉద్యోగంలో చేరినట్లు సమాచారం. మొదట చిన్న గదిలో నివసించిన ఆమె, కొద్దికాలంలోనే విలాసవంతమైన భవనాన్ని కొనుగోలు చేసినట్లు ఆరోపణలు ఉన్నాయి.

ఇదిలా ఉండగా, 2024 జూన్ నుంచి సస్పెన్షన్‌లో ఉన్న శాంతిపై ఇటీవల ఆంధ్రప్రదేశ్ హైకోర్టు సస్పెన్షన్ ఎత్తివేయాలని ఆదేశాలు ఇచ్చింది. సస్పెండ్ అయిన ఏడాదిలోగా చర్యలు తీసుకోకపోతే పోస్టింగ్ ఇవ్వాలనే నిబంధనల నేపథ్యంలో ప్రభుత్వం సస్పెన్షన్‌ను ఉపసంహరించుకుంది. ఇదే సమయంలో అక్రమాస్తులపై ఏసీబీ దర్యాప్తు వేగవంతం చేసి సోదాలు నిర్వహించింది.

విశాఖలోని దేవాదాయ భూముల వ్యవహారాల్లో అక్రమాలు జరిగాయని, వాటి ద్వారా భారీగా డబ్బు సంపాదించారని శాంతిపై ఆరోపణలు వినిపిస్తున్నాయి. గతంలో కూడా ఆమెపై ఆరోపణలు వచ్చినప్పటికీ, అప్పటి రాజకీయ పరిస్థితుల కారణంగా చర్యలు తీసుకోలేదని అంటున్నారు. తాజాగా అరెస్టుతో ఈ వ్యవహారం మళ్లీ హాట్ టాపిక్‌గా మారింది.
WhatsApp "𝘽𝘾𝙉 𝙏𝙑" Group Join Now
Telegram "𝘽𝘾𝙉 𝙏𝙑" Group Join Now