నీటి భద్రత – వనరుల సంరక్షణలో వినియోగదారుల సంఘాల పాత్ర కీలకం: ఎమ్మెల్యే సొంగా రోషన్ కుమార్


చింతలపూడి / లింగపాలెం, BCN NEWS, ఏప్రిల్ 18: నీటి భద్రత మరియు నీటి వనరుల సంరక్షణ బాధ్యత ప్రధానంగా నీటి వినియోగదారుల సంఘాలపై ఉందని చింతలపూడి ఎమ్మెల్యే సొంగా రోషన్ కుమార్ పేర్కొన్నారు. స్వర్ణాంధ్ర–స్వచ్ఛ ఆంధ్ర కార్యక్రమంలో భాగంగా శనివారం లింగపాలెం మండలం ధర్మాజీగూడెం గ్రామంలోని రాపాక చెరువు వద్ద నిర్వహించిన పరిశుభ్రత కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు. చెరువు పరిసరాల్లో శుభ్రత చర్యలు చేపట్టి ప్రజలతో మమేకమయ్యారు.


ఈ సందర్భంగా చెరువు చుట్టుపక్కల ఉన్న తూడు, కంచెలను తొలగించి పరిశుభ్రత కార్యక్రమాన్ని నిర్వహించారు. రైతు సోదరులు, ప్రజలు, కూటమి నాయకులు కలిసి శ్రమదానం చేయడంతో కార్యక్రమం ఉత్సాహంగా సాగింది. చెరువులు శుభ్రంగా ఉంటేనే నీటి నిల్వలు పెరిగి భూగర్భ జలాలు మెరుగుపడతాయని ఎమ్మెల్యే తెలిపారు.

ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు నేతృత్వంలోని ప్రభుత్వం వనరుల అభివృద్ధి కోసం రూపొందించిన 100 రోజుల ప్రత్యేక ప్రణాళికను సద్వినియోగం చేసుకోవాలని ఎమ్మెల్యే సూచించారు. నీటి వనరులను సమర్థంగా వినియోగించుకోవడం ద్వారా వ్యవసాయం అభివృద్ధి చెందుతుందని, రైతులకు లాభదాయకంగా మారుతుందని చెప్పారు.

అధికారులు ప్రభుత్వ మార్గదర్శకాలను పాటిస్తూ భూగర్భ జలాలు పెరిగే విధంగా చర్యలు తీసుకోవాలని ఆయన ఆదేశించారు. చెరువుల పునరుద్ధరణ, నీటి నిల్వ సామర్థ్యాన్ని పెంచడం వంటి అంశాలపై ప్రత్యేక దృష్టి పెట్టాలని సూచించారు. గతంలో ఎన్నడూ లేని విధంగా చేపట్టిన ఈ ప్రత్యేక కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు.

ఈ కార్యక్రమంలో జలవనరుల శాఖ అధికారులు, తహసీల్దార్, ఎంపీడీవో, ఉపాధి హామీ సిబ్బంది, కూటమి నాయకులు, కార్యకర్తలు, రైతు సోదరులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. కార్యక్రమం ద్వారా నీటి సంరక్షణపై ప్రజల్లో అవగాహన పెరిగిందని అధికారులు తెలిపారు.
WhatsApp "𝘽𝘾𝙉 𝙏𝙑" Group Join Now
Telegram "𝘽𝘾𝙉 𝙏𝙑" Group Join Now