ANBALA: హరియాణాలోని అంబాలా నగరంలో ఓ యాచకుడి మరణం తర్వాత వెలుగులోకి వచ్చిన విషయం అధికారులను ఆశ్చర్యానికి గురిచేసింది. గత పదేళ్లుగా మూడు చక్రాల సైకిలుపై నగరంలో తిరుగుతూ భిక్షాటన చేస్తూ వచ్చిన లేఖరాజ్ అనే వృద్ధుడి బ్యాంకు ఖాతాలో రూ.లక్షలు ఉన్నాయని తేలడంతో నోరెళ్లబెట్టారు.
అంబాలాలో నిత్యం రద్దీగా ఉండే రైల్వేస్టేషన్ రోడ్డులోని హనుమాన్ ఆలయం వద్ద చిరిగిన దుస్తులు, నీరసించిన ముఖం, పాత సైకిలుతో కనిపించే లేఖరాజ్ స్థానికులకు సుపరిచితుడే. అతడి సైకిలు వెనుక ఒక చిన్న ట్రంకుపెట్టె కట్టేసి ఉండేది. భక్తులు, ప్రయాణికులు ఇచ్చే డబ్బు అలాగే కూడబెట్టి రూ.లక్షలు చేశాడు.
అనారోగ్యంతో బాధపడుతున్న లేఖరాజ్‌ను ఫిబ్రవరి 9న స్థానిక సామాజిక సంస్థ ‘వందేమాతరం దళ్’ ప్రతినిధులు ప్రభుత్వ ఆసుపత్రిలో చేర్పించారు. చికిత్స పొందుతూ మూడు రోజుల తర్వాత ఆయన కన్నుమూశారు. ఆ సామాజిక సంస్థ సభ్యులే అంత్యక్రియలు చేశారు.
అనంతరం పోలీసులు లేఖరాజ్ సామాన్లను తనిఖీ చేయగా.. ఇనుపపెట్టెలో రూ.50,000 విలువైన రూ.500 నోట్లకట్ట దొరికింది. దీనిపై బ్యాంక్ ఆఫ్ ఇండియా సీలు ఉంది. విడిగా రూ.16,120 మేర నోట్లు ఉన్నాయి. పెట్టెలో దొరికిన పాస్‌బుక్కు ఖాతాలో రూ.3,32,000 జమ చేసి ఉన్నాయి.
