రంగన్నగూడెంలో అంబేద్కర్ జయంతి ఘనంగా


కృష్ణా జిల్లా బాపులపాడు, BCN NEWS: మండలం రంగన్నగూడెం గ్రామంలోని కమ్యూనిటీ హాలులో మంగళవారం ఉదయం భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బి.ఆర్. అంబేద్కర్ గారి 135వ జయంతి వేడుకలు ఘనంగా నిర్వహించబడ్డాయి. గ్రామ పంచాయతీ ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ కార్యక్రమంలో అంబేద్కర్ గారి చిత్రపటానికి పూలమాలలు వేసి ప్రజాప్రతినిధులు, గ్రామ ప్రముఖులు, అధికారులు నివాళులర్పించారు. గ్రామస్థులు పెద్ద సంఖ్యలో పాల్గొని ఆయన సేవలను స్మరించుకున్నారు.


ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన సాగునీటి వినియోగదారుల సంఘాల సమాఖ్య రాష్ట్ర అధ్యక్షులు ఆళ్ళ వెంకట గోపాల కృష్ణారావు మాట్లాడుతూ, అంబేద్కర్ గారు భారత రాజ్యాంగ నిర్మాణంలోనే కాకుండా దేశ అభివృద్ధికి సంబంధించిన అనేక కీలక విధానాల రూపకల్పనలో విశేష కృషి చేశారని తెలిపారు. ముఖ్యంగా నీటి వనరుల అభివృద్ధి, విద్యుత్, పరిశ్రమల విభాగాల అభివృద్ధికి ఆయన తీసుకున్న చర్యలు దేశానికి ఎంతో ఉపయోగపడ్డాయని పేర్కొన్నారు.

అంబేద్కర్ గారి చొరవతోనే కేంద్ర జల వనరుల సంస్థల ఏర్పాటుకు పునాది పడిందని, నదీ జల వివాదాల పరిష్కారానికి రాజ్యాంగంలో ప్రత్యేక నిబంధనలు చేర్చడంలో ఆయన కీలక పాత్ర పోషించారని వివరించారు. ఆయన చూపిన మార్గంలోనే సమానత్వం, సామాజిక న్యాయం, ప్రజల సాధికారత సాధ్యమవుతుందని తెలిపారు.

అణగారిన వర్గాల అభివృద్ధికి విద్య, రాజకీయ ప్రాతినిధ్యం అత్యంత అవసరమని అంబేద్కర్ గారి భావజాలాన్ని గుర్తుచేస్తూ, ప్రజాస్వామ్య వ్యవస్థలో ప్రతి ఒక్కరికీ అవకాశాలు కల్పించడంలో రాజ్యాంగం కీలక పాత్ర పోషిస్తోందని అన్నారు. స్థానిక సంస్థల ఎన్నికల ద్వారా గ్రామ స్థాయి నాయకత్వం ఎదగడానికి రాజ్యాంగం ఇచ్చిన అవకాశాలను ఆయన ప్రస్తావించారు.

ఈ కార్యక్రమంలో తాజా మాజీ సర్పంచ్ కసుకుర్తి రంగా మణి, ఎం.పీ.టి.సి సభ్యులు పుసులూరు లక్ష్మీనారాయణ, పంచాయతీ కార్యదర్శి పి. కృష్ణకాంత్, వివిధ సంఘాల ప్రతినిధులు, గ్రామ ప్రముఖులు, సిబ్బంది పాల్గొన్నారు. అనంతరం కమ్యూనిటీ హాలులో గ్రామ సభ నిర్వహించి, గ్రామ సమస్యలను ప్రజాప్రతినిధులు ప్రభుత్వ దృష్టికి తీసుకువెళ్లారు.
WhatsApp "𝘽𝘾𝙉 𝙏𝙑" Group Join Now
Telegram "𝘽𝘾𝙉 𝙏𝙑" Group Join Now