నారాయణపేట, BCN NEWS: మహాత్మా జ్యోతిబా పూలే మరియు డాక్టర్ బి.ఆర్. అంబేద్కర్ జయంతి సందర్భంగా పుడమి ఫౌండేషన్ ఆధ్వర్యంలో స్వచ్ఛంద రక్తదాన శిబిరం ఘనంగా నిర్వహించబడింది. ఈ కార్యక్రమంలో యువత, సేవా సంస్థల ప్రతినిధులు పెద్ద సంఖ్యలో పాల్గొని రక్తదానం చేసి మానవత్వాన్ని చాటుకున్నారు. రక్తదానం ద్వారా ప్రాణాలను కాపాడే మహత్తర సేవలో భాగస్వాములు కావాలని నిర్వాహకులు పిలుపునిచ్చారు.
ఈ శిబిరానికి ముఖ్య అతిథిగా హాజరైన నారాయణపేట జిల్లా చైల్డ్ వెల్ఫేర్ కమిటీ చైర్మన్ అశోక్ కుమార్ రిబ్బన్ కట్ చేసి శిబిరాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రతి ఒక్కరూ రక్తదానం చేయాలని, అది అత్యంత గొప్ప సేవ అని తెలిపారు. మహనీయులైన జ్యోతిబాపూలే, అంబేద్కర్ గారి ఆశయాలను అనుసరించి సమాజానికి ఉపయోగపడే కార్యక్రమాల్లో పాల్గొనాలని సూచించారు.
పుడమి ఫౌండేషన్ చైర్మన్ జె. వెంకటపతి రాజు మాట్లాడుతూ “రక్తదానం చేయండి – ప్రాణదాతలు కండి” అని పిలుపునిచ్చారు. ఫౌండేషన్ ఆధ్వర్యంలో ఇలాంటి సేవా కార్యక్రమాలు కొనసాగించడం ఆనందంగా ఉందని, భవిష్యత్తులో మరిన్ని సేవా కార్యక్రమాలు చేపడతామని తెలిపారు. అలాగే విద్య, వ్యవసాయం రంగాల్లో రైతులకు అవగాహన కల్పించడంలో కూడా ఫౌండేషన్ ముందుండాలని ఆకాంక్షించారు.
ఈ కార్యక్రమంలో వార్డు కౌన్సిలర్ రాజశేఖర్ రెడ్డి, తెలంగాణ ఉద్యమకారుడు నీలప్ప, అంబేద్కర్ యువజన సంఘం అధ్యక్షుడు పృథ్వీరాజ్ తదితరులు ప్రసంగించారు. మానవ హక్కుల కార్యకర్త మద్దిలేటి, ఏజీ భుట్టో, బాలరాజ్, ఎన్‌ఎస్‌యూఐ ప్రతినిధులు, యూత్ కాంగ్రెస్ నాయకులు, యువకులు పాల్గొని శిబిరాన్ని విజయవంతం చేశారు.
