ఏలూరులో బంగారం చోరీ కేసు ఛేదన


ఏలూరు, BCN NEWS: బస్టాండ్‌లో చోరీకి గురైన 14 కాసుల బంగారు ఆభరణాల కేసును ఏలూరు త్రీ టౌన్ పోలీసులు వేగంగా ఛేదించారు. నిందితురాలిని అదుపులోకి తీసుకుని, ఆమె వద్ద నుండి దొంగిలించబడిన మొత్తం బంగారు ఆభరణాలను స్వాధీనం చేసుకున్నట్లు పోలీసులు వెల్లడించారు. ఈ ఘటనలో బాధితురాలికి న్యాయం జరిగేలా పోలీసులు చురుకుగా చర్యలు చేపట్టారు.


పోలీసుల తెలిపిన వివరాల ప్రకారం, మచిలీపట్నానికి చెందిన కోసి కృష్ణవేణి అనే మహిళ మార్చి 23, 2026న తన కుమార్తెతో కలిసి రాజమండ్రి నుండి మచిలీపట్నం వెళ్తుండగా ఏలూరు బస్టాండ్‌లో బస్సు మారుస్తున్న సమయంలో గుర్తుతెలియని వ్యక్తులు ఆమె చేతి బ్యాగులోని బంగారు ఆభరణాలను అపహరించారు. బాధితురాలి ఫిర్యాదు మేరకు ఏలూరు త్రీ టౌన్ పోలీస్ స్టేషన్‌లో కేసు నమోదు చేశారు.

ఈ కేసు దర్యాప్తు కోసం జిల్లా ఎస్పీ కె. ప్రతాప్ శివ కిషోర్ ఐపీఎస్ ఆదేశాల మేరకు, డీఎస్పీ డి. శ్రావణ్ కుమార్ పర్యవేక్షణలో ప్రత్యేక బృందం ఏర్పాటు చేశారు. త్రీ టౌన్ ఇన్‌స్పెక్టర్ కోటేశ్వరరావు, ఎస్‌ఐ పి. రాంబాబు మరియు క్రైమ్ సిబ్బంది సాంకేతిక ఆధారాలు, సీసీటీవీ నిఘా సహాయంతో నిందితురాలిని గుర్తించారు.

ఈరోజు ఏలూరు బస్టాండ్ సమీపంలో అనుమానాస్పదంగా తిరుగుతున్న ముప్పవరపు సత్యనారాయణమ్మ (62), తూర్పుగోదావరి జిల్లా కాటేరు గ్రామ నివాసిని అదుపులోకి తీసుకుని విచారించగా, ఆమె నేరాన్ని ఒప్పుకుంది. ఆమె వద్ద నుండి బంగారు హారం, నెక్లెస్, బ్రాస్లెట్, మాటీలు, మూడు జతల చెవి దిద్దులు, రెండు ఉంగరాలు కలిపి మొత్తం 14 కాసుల బంగారు ఆభరణాలను పోలీసులు రికవరీ చేశారు.

వేగంగా స్పందించి కేసును ఛేదించిన ఎస్‌ఐ రాంబాబు మరియు క్రైమ్ సిబ్బందిని జిల్లా ఎస్పీ, డీఎస్పీ ప్రత్యేకంగా అభినందించారు. ఈ సందర్భంగా పోలీసులు ప్రజలకు సూచిస్తూ, రద్దీ ప్రదేశాల్లో ప్రయాణించే సమయంలో తమ విలువైన వస్తువులపై అప్రమత్తంగా ఉండాలని సూచించారు.
WhatsApp "𝘽𝘾𝙉 𝙏𝙑" Group Join Now
Telegram "𝘽𝘾𝙉 𝙏𝙑" Group Join Now