హర్మూజ్ జలసంధి వద్ద ఉన్న నౌకలెన్ని? ఏ దేశానివి ఎన్ని?


WORLD NEWS: ప్రపంచ వాణిజ్యానికి కీలక మార్గమైన హర్మూజ్ జలసంధి వద్ద యుద్ధ ఉద్రిక్తతల కారణంగా నిలిచిపోయిన వాణిజ్య నౌకల సంఖ్య భారీగా ఉంది. ఇరాన్ – ఇజ్రాయెల్ – అమెరికా మధ్య జరిగిన ఉద్రిక్తతల ప్రభావంతో జలసంధిలోపల సుమారు 800 నౌకలు, వెలుపల 1200కు పైగా నౌకలు నిలిచిపోయాయి. మొత్తంగా 2000కు పైగా నౌకలు అక్కడే నిలిచిపోయిన పరిస్థితి ఏర్పడింది.


జలసంధిలో నిలిచిపోయిన నౌకల్లో ముడి చమురు ట్యాంకర్లు 350 నుంచి 400 వరకు ఉండగా, గ్యాస్ నౌకలు 80 నుంచి 100 వరకు ఉన్నాయి. మిగతా 300కు పైగా నౌకలు కంటైనర్లు, ఆహార పదార్థాలు, రసాయన సరుకులు తీసుకెళ్తున్నవిగా గుర్తించారు. దేశాల వారీగా చూస్తే భారత్‌కు చెందిన 16 నుంచి 19 నౌకలు ఉండగా, వాటిలో ఎనిమిది వరకు ఇప్పటికే సురక్షితంగా బయటకు వచ్చినట్లు సమాచారం. చైనాకు చెందిన 100కు పైగా చమురు ట్యాంకర్లు, జపాన్ మరియు దక్షిణ కొరియాకు చెందిన 60 నుంచి 80 నౌకలు, ఐరోపా దేశాలకు చెందిన 30 నుంచి 40 నౌకలు అక్కడే నిలిచిపోయాయి.

కాల్పుల విరమణ ప్రకటించినప్పటికీ నౌకల కదలికలు నెమ్మదిగానే కొనసాగుతున్నాయి. బుధవారం ఉదయం నుంచి సాయంత్రం వరకు కేవలం 10 నుంచి 12 నౌకలు మాత్రమే జలసంధిని దాటినట్లు తెలుస్తోంది. సాధారణ పరిస్థితుల్లో రోజుకు సుమారు 135 నౌకలు ఈ మార్గం గుండా ప్రయాణిస్తుంటాయి. ప్రస్తుతం బీమా క్లియరెన్సులు, భద్రతా అనుమానాలు, సాంకేతిక అంశాల కారణంగా నౌకల రాకపోకలు ఆలస్యమవుతున్నాయి.

ఇప్పటికే నిలిచిపోయిన 800 నౌకలను పూర్తిగా బయటకు పంపేందుకు మూడు నుంచి ఐదు రోజుల సమయం పట్టే అవకాశం ఉందని అధికారులు అంచనా వేస్తున్నారు. అయితే పరిస్థితులు పూర్తిగా సాధారణ స్థితికి రావడానికి మరో రెండు నుంచి నాలుగు వారాల సమయం పడుతుందని భావిస్తున్నారు.
WhatsApp "𝘽𝘾𝙉 𝙏𝙑" Group Join Now
Telegram "𝘽𝘾𝙉 𝙏𝙑" Group Join Now