ఏలూరు జిల్లా లింగపాలెం, BCN NEWS: మండలంలోని తోచలకరాయుడుపాలెంలో పోలీసుల ఆధ్వర్యంలో పల్లెనిద్ర కార్యక్రమంతో పాటు సైబర్ నేరాలు, కొత్త చట్టాలపై అవగాహన సదస్సు నిర్వహించారు. జిల్లా ఎస్పీ ప్రతాప్ శివ కిషోర్ ఆదేశాల మేరకు జంగారెడ్డిగూడెం సబ్ డివిజన్ ఏఎస్పీ సుస్మిత, చింతలపూడి సర్కిల్ ఇన్స్పెక్టర్ క్రాంతి కుమార్, ధర్మాజీగూడెం ఎస్‌ఐ వెంకన్న బాబు ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం జరిగింది.
ఈ సందర్భంగా పోలీసులు గ్రామంలోనే రాత్రి బస చేస్తూ ప్రజలతో మమేకమయ్యారు. పల్లెనిద్ర కార్యక్రమం ద్వారా గ్రామాల్లో శాంతిభద్రతలు మెరుగుపరచడం, ప్రజల్లో భద్రతా నమ్మకం పెంచడం లక్ష్యంగా పనిచేస్తున్నట్లు తెలిపారు.
అవగాహన సదస్సులో భాగంగా మహిళల రక్షణకు సంబంధించిన చట్టాలు, ట్రాఫిక్ నియమాలు, సామాజిక భద్రత అంశాలపై వివరించారు. సైబర్ నేరాలు పెరుగుతున్న నేపథ్యంలో OTPలు, బ్యాంక్ వివరాలు, ATM పిన్‌లు వంటి వ్యక్తిగత సమాచారాన్ని ఎవరితోనూ పంచుకోవద్దని సూచించారు. అనుమానాస్పద కాల్స్, మెసేజ్‌లు వస్తే వెంటనే పోలీసులకు సమాచారం ఇవ్వాలని తెలిపారు.
గ్రామస్తులు తమ సమస్యలను అధికారులకు తెలియజేయగా, వాటి పరిష్కారానికి చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో గ్రామ పెద్దలు, మహిళలు, యువకులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. పోలీస్ శాఖ చేపడుతున్న ఇలాంటి కార్యక్రమాలు గ్రామాల్లో నేరాల నియంత్రణకు, ప్రజలతో పోలీసుల అనుబంధాన్ని బలోపేతం చేయడానికి దోహదపడతాయని అధికారులు పేర్కొన్నారు.
