ఆంధ్రప్రదేశ్, అమరావతి: ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో కూటమి సమీకరణాలు కొత్త మలుపు తిరుగుతున్నాయి. ప్రస్తుతం అధికారంలో ఉన్న తెలుగుదేశం పార్టీ, జనసేన పార్టీ, భారతీయ జనతా పార్టీ కూటమిలో సీట్ల పెంపు అంశం హాట్ టాపిక్‌గా మారింది. ప్రస్తుతం ఉన్న 175 అసెంబ్లీ సీట్లు 2029 నాటికి సుమారు 263కి పెరిగే అవకాశం ఉందన్న ప్రచారం రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశంగా మారింది.
క్షేత్ర స్థాయిలో బలమైన నిర్మాణం కలిగిన టీడీపీ, రాష్ట్రవ్యాప్తంగా పటిష్టమైన క్యాడర్‌తో ముందంజలో ఉండగా, జనసేన క్రమంగా తన బలాన్ని విస్తరించుకుంటోంది. బీజేపీ కూడా పొత్తు పార్టీగా ఉండి తన ప్రభావాన్ని పెంచుకోవాలని చూస్తోంది. 2024 ఎన్నికల్లో ఈ మూడు పార్టీలు సర్దుబాట్లతో కలసికట్టుగా పోటీ చేసి విజయం సాధించాయి. అయితే 2029 నాటికి సీట్ల పెంపు కారణంగా కొత్త అవకాశాలు, కొత్త సవాళ్లు ఎదురయ్యే పరిస్థితి కనిపిస్తోంది.
సీట్ల సంఖ్య పెరగడం కూటమి పార్టీలకు మహత్తర అవకాశంగా భావిస్తున్నారు. ముఖ్యంగా ఆశావహుల సంఖ్య ఎక్కువగా ఉన్న నేపథ్యంలో అదనపు సీట్లు వారికి అవకాశం కల్పిస్తాయని విశ్లేషణలు వెలువడుతున్నాయి. జనసేనలో ఈసారి 70 వరకు సీట్లలో పోటీ చేయాలన్న అభిలాష వ్యక్తమవుతుండగా, బీజేపీ 30 సీట్ల వరకు లక్ష్యంగా పెట్టుకున్నట్లు సమాచారం. అదే సమయంలో టీడీపీ 200 ప్లస్ సీట్లలో పోటీ చేయాలన్న ఆలోచనలో ఉన్నట్లు తెలుస్తోంది.
అయితే సీట్ల పంపకం విషయంలో 2024 ఎన్నికల ఫలితాలు, ఓటు శాతం, గతంలో కేటాయించిన సీట్ల రేషియో వంటి అంశాలు కీలకంగా మారే అవకాశముంది. గత ఎన్నికల్లో జనసేన 21 సీట్లలో పోటీ చేసి అన్ని గెలవగా, బీజేపీకి ఇచ్చిన 10 సీట్లలో 8 గెలిచింది. ఈ లెక్కన చూస్తే 2029లో జనసేనకు 40కు పైగా, బీజేపీకి 20 వరకు సీట్లు దక్కే అవకాశం ఉందన్న చర్చ సాగుతోంది. అలా అయితే టీడీపీకి 200కు పైగా సీట్లలో పోటీ చేసే అవకాశం లభిస్తుందని అంచనా వేస్తున్నారు.
కూటమి పార్టీలు కలసికట్టుగా ముందుకు సాగుతూ ప్రత్యర్థి వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీకు అవకాశం ఇవ్వకుండా వ్యూహాలు రచిస్తున్నాయి. బలమైన ప్రాంతాల్లో ఆయా పార్టీలు పోటీ చేయడం, మిగిలిన చోట్ల పరస్పర మద్దతు ఇవ్వడం ద్వారా గరిష్ట ఫలితాలు సాధించాలని లక్ష్యంగా పెట్టుకున్నట్లు తెలుస్తోంది. మొత్తంగా సీట్ల పెంపు జరిగితే కూటమి పార్టీలకు విస్తృత అవకాశాలు లభించే అవకాశం ఉందని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు.
